‘నిర్భయ’ తరహాలో మరో ఘోరం.. ఒళ్లంతా పంటి గాట్లు, గాయాలే..

‘నిర్భయ’ తరహాలో మరో ఘోరం.. ఒళ్లంతా పంటి గాట్లు, గాయాలే..
  • మధ్యప్రదేశ్​లో మైనర్​పై గ్యాంగ్ రేప్ 
  • ఒళ్లంతా పంటి గాట్లు, గాయాలే.. 
  • రక్తపుమడుగులో దొరికిన పదకొండేండ్ల చిన్నారి 
  • బాలిక పరిస్థితి సీరియస్.. ఇద్దరు నిందితుల అరెస్ట్

మైహర్ (మధ్యప్రదేశ్):  నిర్భయ ఘటన తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్​లో పదకొండేండ్ల చిన్నారిపై కొందరు దుండగులు పాశవికంగా అత్యాచారం చేశారు. ఒళ్లంతా పంటిగాట్లతో, గాయాలతో అడవిలో రక్తపుమడుగులో దొరికిన ఆ చిన్నారి ఇప్పుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్​లోని సత్నా జిల్లా మైహర్ టౌన్​లోని ప్రఖ్యాత శారదా దేవి గుడికి సమీపంలోని అడవిలోనే గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది.

నిందితుల్లో ఒకరు గుడి మేనేజ్మెంట్ కమిటీ నిర్వహిస్తున్న గోశాలలో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు.  

అడవిలో దొరికిన చిన్నారి.. 

మైహర్ టౌన్​లోని అర్కండి టౌన్ షిప్ సమీపంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న బాధిత బాలిక గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. రాత్రి అవుతున్నా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేసి, ఆమె కోసం వెతికారు. చివరకు శుక్రవారం ఉదయం టౌన్ షిప్​కు కిలోమీటరు దూరంలో అడవిలో చిన్నారి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన కుటుంబ సభ్యులు బాలికను మైహర్ సివిల్ హాస్పిటల్​కు తరలించారు. దారుణం గురించి తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ స్టేట్ చీఫ్ కమల్ నాథ్ ట్విట్టర్​లో మండిపడ్డారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.