మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా పిల్లలు చనిపోయాయి. రెండు రోజుల క్రితం ఒక చీతా పిల్ల మృతి చెందగా... తాజాగా మే 25వ తేదీన మరో రెండు చిరుత పులి పిల్లలు చనిపోయాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాల అనే చీతాకు రెండు నెలల క్రితం నాలుగు పిల్లలు జన్మించాయి. ఇందులో 2 రోజుల వ్యవధిలోనే మూడు పిల్లలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
చీతా పిల్లలు ఎందుకు మృతి చెందాయంటే
కునో నేషనల్ పార్కులో వరుసగా చీతాలు చనిపోవడంపై అక్కడి అటవీ అధికారులు స్పందించారు. పార్కులో ప్రతికూల వాతావరణ పరిస్థితులు. డీహైడ్రేషన్ కారణంగానే చీతాలు మృతి చెందుతున్నట్లు వెల్లడించారు.కునో జాతీయ పార్కు ప్రాంతంలో రికార్డు స్థాయిలో 46 నుంచి 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడిమిని తట్టుకోలేక చీతా కూనలు నీరసించిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పశువైద్యులకు సమాచారం అందించగా....చీతా పిల్లలకు చికిత్స చేశారు. మే 23వ తేదీన మంగళవారం జ్వాలా అనే తల్లి చీతాతోపాటు మూడు పిల్లలు తిరిగాయి. ఒక కూన మాత్రం లేవలేని స్థితిలో ఉన్నట్లు పర్యవేక్షకులు గుర్తించారు. అయితే దానికి చికిత్స అందించేలోపే అది చనిపోయినట్లు తెలిపారు. తాజాగా మరో రెండు చీతా కూనలు కూడా చనిపోయాయి. జ్వాలా చీతాకు పుట్టిన పిల్లల్లో మూడు చనిపోయగా..మరో చీతా కూన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వివరించారు. దానికి కూడా చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
1948లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో చిరుతలు కనుమరుగయ్యాయి. దీంతో వీటిని అంతరించిన జాతిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం 1952లో ప్రకటించింది. దాదాపు 75 ఏండ్ల తర్వాత ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చిరుతలను కునో నేషనల్ పార్క్‌కు తరలించింది. 2022 ప్రధాని మోదీ తన పుట్టిన రోజున సందర్భంగా వాటిని ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లోని ఒక ఆడ చీతా దక్ష మే 9న మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న చనిపోయింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే మగ చీతా ఏప్రిల్ 23న మృతి చెందింది. తాజాగా ‘జ్వాల’ అనే చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో మూడు చనిపోయాయి. దీంతో 2 నెలల వ్యవధిలో మొత్తం ఆరు చీతాలు మరణించాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్కులో 17 చిరుతలు, ఒక పిల్ల మిగిలింది.