మధ్యప్రదేశ్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు దుర్మార్గులు ఓ వ్యక్తి మెడకు కుక్క తాడును కట్టి..కుక్కలా మొరుగు అంటూ వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా పోలీసులను ఆదేశించడంతో...నిందితులను అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దుర్మార్గులపై మత స్వేచ్ఛ చట్టం కింద 365, 341, 342, 323, 327, 294, 427 సెక్షన్లను నమోదు చేశారు.
48 సెకండ్ల వీడియోలో ఓ వ్యక్తిని కుక్కల మారాలని బెదిరించారు. అలాగే క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సమీర్, సాజిద్, ఫైజాన్‌లను అరెస్టు చేశారు. బాధితుడిని విజయ్ రామచందానిగా గుర్తించారు. మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, అపహరణ, బంధించడం, ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టడం వంటి ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ వీడియోపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ, "నేను ఆ వీడియో చూశాను. ఇది ఒక బాధాకరమైన సంఘటన. మానవుడి పట్ల ఇలాంటి ప్రవర్తించడం ఖండించదగినది...అని అన్నారు.
నిందితులపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగం
నిందితుల్లో నేర చరిత్ర కలిగిన ముగ్గురు నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
నిందితుడి ఇళ్లు కూల్చివేత..
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ ఖాన్ నివాసాన్ని పోలీసుల సమక్షంలో స్థానిక యంత్రాంగం కూల్చివేసింది. ఇనుప పనిముట్లతో గోడలను నేలమట్టం చేశారు.