ఇతనో ప్రభుత్వ ఉద్యోగి.. అవినీతి సొమ్ము తినటం బాగా అలవాటు పడ్డాడు. తినటం అంటే అలా ఇలా కాదండీ.. డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికాడు. అంతే వెంటనే తన చేతిలో డబ్బులను నోట్లో వేసుకుని మింగేశాడు.. షాక్ అయిన ఆఫీసర్స్.. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి కక్కించారు. ఇప్పుడు ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓ ఉద్యోగి.. ఆ డబ్బును నమిలి మింగేశాడు. మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెవెన్యూ విభాగానికి చెందిన పట్వారీ గజేంద్రసింగ్.. ఓ భూమి కేసులో ఫిర్యాదుదారు చందన్ సింగ్ లోధి నుంచి రూ.5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో లోధి జబల్ పూర్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత లోకాయుక్త అధికారులు విచారణ జరిపి బిల్హారీ గ్రామంలోని పట్వారీ గజేంద్రసింగ్ ప్రైవేటు కార్యాలయానికి చేరుకున్నారు. చందన్ సింగ్ నుంచి రూ.4వేల 5వందలు లంచం తీసుకుంటుండగా అతన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంంతలోనే పట్వారీ గజేంద్రసింగ్ ఆ లంచం డబ్బును నమిలి మింగేసి అందర్నీ షాక్ కు గురి చేశాడు.
ఈ క్రమంలో నగదును మింగేసిన ఆ పట్వారీని అధికారులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పట్వారీ నోటి నుంచి లంచం నోట్లను గుజ్జు రూపంలో కక్కించారు. అనంతరం లంచగొండి పట్వారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సంజయ్ సాహు చెప్పారు. ప్రస్తుతం తను క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేశారు.