సమయానికి అంబులన్స్ రాకపోవడంతో.. ఓ మహిళ రోడ్డు పక్కనే శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వివరాలు.. బుర్హాన్ పూర్ జిల్లాకు చెందిన కమలాభాయ్ ప్రసవవేదనతో విలవిల్లాడుతుంది. దాంతో ఆమె భర్త గర్భిణి మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘జనని ఎక్స్‌ప్రెస్’ అంబులెన్స్‌కు కాల్ చేశాడు. అయితే అంబులెన్స్ సరైన సమయానికి రాలేదు. కమలాభాయ్ నొప్పులతో బాధపడుతుంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కమలాభాయ్ భర్త తన బైక్ మీద ఆమెని హస్పిటల్ కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఈ లోపే కమలాభాయ్ రోడ్డు పక్కనే బిడ్డకు జన్మనిచ్చింది. అధికారుల అలసత్వం మూలానా ఓ మహిళ నడి రోడ్డుపై బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. మహిళ కనబడకుండా బైకులు అడ్డంగా పెట్టారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి షాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. డాక్టర్లు కమలాభాయ్, ఆమె కుమార్తెను హస్పిటల్లో చేర్చుకుని ట్రీట్ మెంట్ అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కమలాభాయ్ కుటుంబ సభ్యులు సీరియస్ అయ్యారు. అంబులెన్స్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.