అవినీతి, లంచగొండితనంపై ప్రజలు ఆగ్రహం చేస్తున్నా… లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ ఆయా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కొంత మంది ఉద్యోగుల్లో ఏ మాత్రం మార్పురావడం లేదు. పనుల కోసం వచ్చే జనాలను లంచాల పేరుతో వేధిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగి అడిన లంచం ఇచ్చుకోలేక…ఓ మహిళ ఏకంగా గేదెను లంచంగా ఇచ్చేందుకు కార్యాలయానికి తీసుకొచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
సిద్ధి జిల్లాలోని సిహ్వాల్ గ్రామానికి చెందిన రామకాళి పటేల్ అనే మహిళ.. పూర్వీకుల ఆస్తిని తన పేర బదలాయించుకోడానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లింది. తహసీల్దార్ మైకేల్ టిర్కీని సంప్రదించింది. ఆ పనిని ఆఫీసు సిబ్బందికి అప్పగించారు. అయితే పని జరగాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని కార్యాలయం సిబ్బంది చెప్పారు. చేసేది లేక వాళ్లు అడిగినంత అప్పగించింది. అయినా పని జరగకపోగా మళ్లీ లంచం అడగడంతో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ… లంచంగా ఇచ్చేందుకు గేదెను ఆఫీసుకు తోలుకొచ్చింది.
విషయాన్ని గమనించిన మీడియా…తహశీల్దార్ ను వివరణ కోరారు. అయితే నవంబరు 14నే ఆమె పని పూర్తయిందని, పేపర్లకు సంబంధించి ఓ కాపీ కూడా అందజేశామని ఆయన తెలిపారు. అంతేకాదు లంచం తీసుకున్నాడని ఆ మహిళ ఆరోపిస్తున్న క్లర్కు అనారోగ్య కారణాలతో మూడు నెలలుగా ఆస్పత్రిలో ఉన్నాడని చెబుతున్నారు.