బెంగళూరు: కీలక ఆటగాళ్లు లేరు.. ఫేవరెట్ హోదా అసలే లేదు.. గత పదేళ్ల పెర్ఫామెన్స్ అంతకన్న బాగా లేదు.. అయినా రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ జట్టు మాయ చేసింది. అత్యద్భుతమైన ఆల్‌రౌండ్ షోతో.. 41సార్లు విజేత, డొమెస్టిక్ క్రికెట్లో మేటి జట్టు ముంబైకి చెక్ పెట్టింది. ఆదివారం ముగిసిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో గెలిచిన ఎంపీ తొలిసారి టైటిల్ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ముంబై నిర్దేశించిన 108 రన్స్ టార్గెట్‌ను 29.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిమాన్షు (37), శుభమ్ శర్మ (30), రజత్ పటీదార్ (30 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శామ్స్ ములానీ 3, ధవల్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు 113/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో 269 రన్స్‌కు ఆలౌటైంది. సువేద్ పార్కర్ (54), సర్ఫరాజ్ ఖాన్ (45) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఎంపీ బౌలర్లలో కుమార్ కార్తికేయ (4/98), గౌరవ్ యాదవ్ (2/53), పార్త్ సహానీ (2/43) ఆకట్టుకున్నారు. శుభమ్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ఈ టోర్నీలో 982 రన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.
23 ఏళ్ల తర్వాత పండిట్ కల సాకారం
మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ చంద్రకాంత్ పండిట్ ఫైనల్ తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. 1999లో పండిట్ కెప్టెన్సీలోని ఎంపీ జట్టు..ఇదే గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో కర్నాటక చేతితో ఓడిపోయింది. దాని తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికిన పండిట్.. 23 ఏళ్ల తర్వాత కోచ్‌గా ఎంపీకి రంజీ టైటిల్‌ను సాధించి పెట్టాడు. కోచ్‌గా అతనికి ఇది ఆరో రంజీ ట్రోఫీ కావడం విశేషం. ఇది వరకు చిన్న జట్టు విదర్భకు వరుసగా రంజీ, ఇరానీ ట్రోఫీలు అందించాడు. ఇప్పుడు తన సొంత జట్టు మధ్యప్రదేశ్ కల సాకారం చేశాడు. స్టార్ ప్లేయర్లు అవేశ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్ నేషనల్ టీమ్‌కు వెళ్లిపోవడంతో.. ఎంపీ జట్టులో పటీదార్ మాత్రమే నమ్మదగిన ప్లేయర్‌గా ఉన్నాడు. అయినప్పటికీ జూనియర్ ప్లేయర్లకు పండిట్ తన ‘గురుకుల్ స్టైల్’ కోచింగ్ ఇచ్చి ఎంపీ టీమ్‌ను విజేతగా నిలిపాడు. ఈ విజయంతో ఇండియాలో క్రికెట్.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా లాంటి మహా నగరాలను దాటి చిన్న ప్రదేశాలకు కూడా విస్తరించిందని పండిట్ నిరూపించాడు.