కరోనావైరస్ దృష్ట్యా మధ్యప్రదేశ్‌లోని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా టెన్త్, ఇంటర్ విద్యార్థులకు త్వరలోనే రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ద్వారా గ్రేడింగ్ ఇచ్చి పైతరగతులకు ప్రమోట్ చేస్తామని ఆయన తెలిపారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు త్వరలోనే బోర్డు పరీక్షలు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల మధ్య సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తొమ్మిది మరియు పదకొండో తరగతుల విద్యార్థులకు వారంలో రెండు రోజులు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని.. త్వరలోనే తరగతులు మొదలవుతాయని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఏప్రిల్ 1, 2021న ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 10,000 నాణ్యమైన పాఠశాలలను ప్రారంభించటానికి కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చౌహాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్య యొక్క నాణ్యతను మెరుగుపరిచేందుకు, ఒకే క్యాంపస్‌లో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను ‘ఏక్ పరిసర్- ఏక్ శాల’పథకం కింద విలీనం చేశారు.
రాష్ట్రంలో కొత్త విద్యా విధానం అమలుచేయడం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యావ్యవస్థను అధ్యయనం చేయాలని.. ఆ తర్వాతే రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.
For More News..