మధ్యప్రదేశ్ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. జ్యోతిరాధిత్య సింధియా బాటలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల వల్ల ఆ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా మార్చి 10న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన బాటలోనే ఆయన వర్గ ఎమ్మెల్యేలు 22 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా వారందరూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంలో ఈ ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు.
మధ్యప్రదేశ్ అభివృద్ధిలో నాతో పాటు పనిచేసిన మరియు నా కుటుంబంలో భాగమైన ఈ 22 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు నాతో కలిసి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకొని.. ఆయన సమక్షంలో పార్టీలో చేరారు అని సింధియా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత.. ఈ 22 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స్పీకర్‌కు తమ రాజీనామా పత్రాలను పంపించారు. కానీ, స్పీకర్ వాటిని ఆమోదించలేదు. దాంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొన్ని వారాల నాటకీయత తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించారు.
స్పీకర్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంతో.. ఆ మరుసటి రోజు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ కోట్లు ఖర్చుపెట్టి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేసిందని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 230. కానీ, 22 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా మరియు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206కి పడిపోయింది. ఇందులో కాంగ్రెస్ బలం 92 ఉండగా.. బీజేపీకి 105 మంది ఉన్నారు.
For More News..