ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ : గాయపడిన వ్యక్తిని 1.5 కిలోమీటర్లు మోసుకెళ్లాడు

ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ : గాయపడిన వ్యక్తిని 1.5 కిలోమీటర్లు మోసుకెళ్లాడు

అతడి భుజమే స్ట్రెచర్ అయింది. అతడి కాళ్లే అంబులెన్సులా పరుగెత్తాయి. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టా యి. రైలు నుంచి కిందపడి దెబ్బలు తగిలిన వ్యక్తిని భుజాలపై మోసుకుంటూ 1.5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడు ఆ కానిస్టేబుల్ . ఈ ఘటన శనివారం మధ్యప్రదేశ్ లోని హోషంగబాద్ లో జరిగింది. ప్రాణం కాపాడిన ఆ కానిస్టేబుల్ పేరు పూనమ్ బిల్లోర్ . ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని ఠాణేకి చెందిన అజీత్ సూరజ్ అనే వ్యక్తి భాగల్ పూర్ ఎక్స్​ప్రెస్ రైలు నుంచి పఘ్ద ల్ అనే ఊళ్లో కిందపడ్డాడు. ఎవరో డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం చెప్పడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే, అక్కడకు వాళ్ల జీప్ వెళ్లే అవకాశం లేకపోవడంతో కాలినడకన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అజీత్ కు రక్తం పోతుండడం ఏ వాహనమూ వచ్చే దారి లేకపోవడంతో ఏం ఆలోచించకుండా అజీత్ ను భుజాలమీదకు ఎత్తుకున్నాడు బిల్లోర్ . 1.5 కిలోమీటర్లు ఏకధాటిగా పరుగెత్తాడు. తమ జీపులో ఎక్కించుకుని అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని సియోని మాల్వా అనే పట్టణంలో ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, హోషంగబాద్ తీసుకెళ్లాల్సందిగా సూచించారు. వెంటనే హోషంగాబాద్ తీసుకెళ్లి అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అజీత్ ఇప్పుడు కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పా రు. ఇంత సాహసం చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన బిల్లోర్ ను మధ్యప్రదేశ్ డీజీపీ వీకే సింగ్ ప్రశంసించారు. అతడు చేసిన మంచి పనికి ఏదైనా రివార్డు ఇచ్చి సత్కరించాలని హోషంగబాద్ ఎస్పీకి డీజీపీ సూచించారు.