మధ్యప్రదేశ్ అమ్మాయికి స్టేట్ 8వ ర్యాంక్
భిండ్: ఆ అమ్మాయి మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు కూతురు. రోజూ 24 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ స్కూల్ కు వెళ్లింది. ఎంతో కష్టమైనా.. ఇష్టపడి, పట్టుదలతో చదువుకుంది. ఇప్పుడు టెన్త్ లో స్టేట్ టాపర్లలోనే ఒకరిగా నిలిచింది. గవర్నమెంట్ స్కూల్ లోనే చదివినా, 98.75% మార్కులు తెచ్చుకుని స్టేట్ లోనే 8వ ర్యాంకును సాధించింది. మధ్యప్రదేశ్ లోని చంబల్ ఏరియా భిండ్ జిల్లా అజ్నోల్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల రోషణీ భదోరియా సక్సెస్ స్టోరీ ఇది. తన కూతురు సాధించిన ఈ విజయం తనకు గర్వకారణమని ఆమె తండ్రి పురుషోత్తమ్ భదోరియా చెప్పారు. తనతో పాటు ఊరు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మొదట్లో వేరే స్కూలుకు వెళ్లిన రోషణి రెండేళ్ల క్రితం మెహ్ గావ్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూలులో 9వ తరగతిలో చేరింది. కానీ 12 కిలోమీటర్ల దూరంలోని స్కూలుకు వెళ్లేందుకు ఆటోలు, బస్సుల వంటివి అందుబాటులో లేకపోవడంతో సైకిల్ పైనే పోయేది. అప్పుడప్పుడూ తన తండ్రి మోటార్ బైకుపై స్కూలుకు తీసుకెళ్లేవాడు. సైకిల్ తొక్కుతూ పోయి రావడం చాలా కష్టమైనా, చదువు మీద ఉన్న ఇంట్రస్ట్ తో తాను ఇష్టపడి వెళ్లేదాన్నని రోషణి వెల్లడించింది. స్కూలు నుంచి వచ్చాక రోజూ ఏడెనిమిది గంటలు కష్టపడి చదివానని తెలిపింది. పైచదువులు పూర్తి చేసి, సివిల్ సర్వీసెస్ ఎగ్జాం రాస్తానని, కలెక్టర్ ఉద్యోగం సాధించి, ప్రజలకు సేవ చేస్తానని రోషణి చెప్తోంది.
For More News..