బీజేపీ నీడలో మందకృష్ణ ..ఆయన మాదిగ కాదు క్రిస్టియన్: మాదిగ దండోరా ప్రెసిడెంట్ సతీశ్ మాదిగ

బీజేపీ నీడలో మందకృష్ణ ..ఆయన మాదిగ కాదు క్రిస్టియన్: మాదిగ దండోరా ప్రెసిడెంట్ సతీశ్ మాదిగ
  • మరో నాలుగేండ్లు వర్గీకరణను సాగదీద్దామనుకున్నడు  
  • మంద కృష్ణ.. మాదిగ కాదు, ఆయన పేరు మంద ఏలియా.. క్రిస్టియన్
  • మంత్రి దామోదరపై చేసిన ఆరోపణలకు ఆయన క్షమాపణలు చెప్పాలి
  • ఖర్గే, కాకా, భట్టి కుటుంబాలపై మంద కృష్ణది తప్పుడు ప్రచారం
  • వర్గీకరణపై ఎస్సీలందరూ సంతోషంగా ఉన్నరు
  • వీ6 వెలుగు ఇంటర్వ్యూలో మాదిగ దండోరా ప్రెసిడెంట్ సతీశ్ మాదిగ

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గకరణ ఉద్యమం 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అని మాదిగ దండోరా ప్రెసిడెంట్ సతీశ్ మాదిగ అన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేత టీఎన్ సదాలక్ష్మి ఈ ఉద్యమం స్టార్ట్ చేశారని పేర్కొన్నారు. తరువాత 1994 లో మాజీ సీఎం జలగం వెంగళరావు ఆధ్వర్యంలో నిజాం గ్రౌండ్ లో నాలుగు లక్షల మందితో వర్గీకరణపై మీటింగ్ నిర్వహించారని వీ6 వెలుగు ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రభుత్వం చేసిన వర్గీకరణకు ఎస్సీలంతా సంతోషంగా ఉన్నారని, కేవలం కొంత మంది తమ స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. 

వీ6: ఎస్సీ వర్గీకరణపై త్వరలో ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది, వర్గీకరణపై ప్రజలు ఏమనుకుంటున్నారు, రెండు వర్గాలు సంతృప్తిగా ఉన్నాయా?

సతీశ్: కాంగ్రెస్ లో సీనియర్ నేత సదాలక్ష్మి వర్గీకరణపై ఉద్యమం ప్రారంభించారు. తరువాత 1994 లో మాజీ సీఎం జలగం వెంగళరావు నిజాం గ్రౌండ్ లో నాలుగు లక్షల మందితో వర్గీకరణపై భారీ సభ పెట్టారు. ఈ మీటింగ్​లో గందరగోళం, గొడవ జరిగింది. దీనికి హాజరైన మంద కృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమాన్ని ఎంఆర్ పీఎస్ పేరుతో ప్రకాశం జిల్లా ఈదుగుల అనే గ్రామంలో స్టార్ట్ చేశారు. సదాలక్ష్మి పదేండ్లు పోరాటం చేస్తే మంద కృష్ణ 30 ఏండ్లు పోరాటం చేశారు. ఆయన దగ్గర నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ గా ఉద్యమంలో పాల్గొన్నాను. ఈ సుదీర్ఘ పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వంతో పూర్తయింది.

వీ6: వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేబినెట్ లో ఆమోదించింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మళ్లీ వన్​మ్యాన్ కమిషన్ గడువును ఎందుకు పెంచింది?

సతీశ్: వర్గకరణపై ఉద్యమం చేస్తున్న మంద కృష్ణ మాదిగ బీజేపీ కౌగిలిలో ఉన్నాడు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్లను నియమించి తీర్పు వచ్చేందుకు కృషి చేసింది. కాషాయ జెండా నీడలో ఉన్న మందకృష్ణకు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం ఇష్టం లేదు. మాదిగలకు ఇంత వాటా కావాలని మంద కృష్ణ ఎప్పుడూ అడగలేదు. కనీసం వన్​మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు కూడా ఈ అంశంపై వినతిపత్రం ఇవ్వలేదు.

వీ6: మాదిగలకు ఇంకా రిజర్వేషన్ పెంచాలని మంద కృష్ణ అంటున్నరు.

సతీశ్: మంద కృష్ణకు ఇంత త్వరగా వర్గీకరణ జరగడం ఇష్టం లేదు. మరో నాలుగేండ్లు ఈ అంశాన్ని సాగదీద్దామని అనుకున్నడు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వర్గీకరణ కావాలనేది ఆయన ఆలోచన. మాలలు వర్గీకరణను అడ్డుకుంటున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నడు. ఇందులో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాకా వెంకటస్వామి కుటుంబంలో వివేక్ వెంకటస్వామి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబాలు మందు నుంచి కాంగ్రెస్ కు చెందినవి. ఈ కుటుంబాలు గతంలోనే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశాయి. వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నపుడు మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారు. ఆయన నిజంగా వర్గీకరణకు వ్యతిరేకమైతే మేనిఫెస్టోలో ఎందుకు చేరుస్తారు. చేవేళ్లలో కాంగ్రెస్ డిక్లరేషన్​లో ఎస్సీవర్గీకరణను మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఖర్గే, వివేక్ వెంకటస్వామిపై మంద కృష్ణ ఆరోపణలు ప్రారంభించారు. వర్గీకరణ కాకుండా కాలయాపన చేసి.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక చేద్దామనేది ఆయన ఆలోచన. మాదిగలను ఆ పార్టీకి అనుచరులుగా మార్చాలని భావిస్తున్నరు. ఆయనకు ఇపుడు పద్మశ్రీ వచ్చింది.. భవిష్యత్ లో పద్మభూషణ్ వస్తుంది, రాజ్యసభ ఎంపీ కూడా అవుతారు.

వీ6: వర్గీకరణలో నేతకాని కులానికి అన్యాయం జరిగిందని అంటున్నరు. ఇందులో నిజం ఎంత?

సతీశ్: వివేక్ వెంకటస్వామి అన్ని కులాలకు న్యాయం చేయాలని మందమర్రిలో లెదర్ పార్కుకు రూ.20 లక్షలు ఇచ్చి పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నరు. ఆయన మాదిగలకు వ్యతిరేకం అయితే మాదిగలకు సంబంధించిన లెదర్ పార్క్ ఎందుకు అభివృద్ధి చేస్తరు. నేతకాని కులానికి కార్పొరేషన్ కావాలని కూడా వివేక్ అడిగారు. ఇంత కాలం వర్గీకరణను వ్యతిరేకించిన కులాలు ఇపుడు మందకృష్ణ మా నాయకుడు అని అంటున్నాయి. ఇపుడు ‘సీ’ గ్రూప్ లో వద్దు మాకు సపరేట్ గ్రూపు కావాలని నేతకాని వర్గం అంటున్నది.  వీరిని తీసుకొని సీఎం దగ్గరకు వెళ్లిన మంద కృష్ణ వన్​మ్యాన్ కమిషన్ గడువు పెంచాలని, వర్గీకరణ ఆపాలని 
కోరారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎంతో కృషి చేసిన మంత్రి దామోదర రాజనర్సింహను మాదిగ కాదు అంటూ అవమానిస్తున్నరు. నిజానికి మంద కృష్ణనే మాదిగ కాదు.. ఆయన పేరు మంద ఏలియా.. క్రిస్టియన్.. బీసీ ‘సీ’​ వర్గానికి చెందిన ఆయన దామోదరను విమర్శించడం ఏంటి? దీనికి మంద కృష్ణ వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ 
చేస్తున్నా.

ప్రభుత్వం వర్గీకరణపై చట్టం చేస్తుంది. కమిషన్ గడువు పెంచింది. చట్టం అయితే రెండు వర్గాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవా?
ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఈ నెలలో వర్గీకరణ అసెంబ్లీలో టేబుల్ చేసిన తరువాత ఏ కులానికి చెందిన నాయకులు కూడా సీఎంను కలవలేదు. వర్గీకరణలో మాకు అన్యాయం జరిగిందని, వర్గీకరణ వద్దని చెప్పలేదు. వర్గీకరణపై ఉద్యమం చేసిన మంద కృష్ణ మాత్రమే వర్గీకరణ లేట్ కావాలని 20 రోజులు గ్యాప్ తీసుకొని సీఎంను కలిశాడు. మంద కృష్ణ వర్గీకరణను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తుండనేందుకు ఇదే బెస్ట్ ఉదాహరణ.

ప్రభుత్వం చేసిన వర్గీకరణపై మంద కృష్ణకు ఉన్న అభ్యంతరం ఏంటి. వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని లెక్కలు తీసే చేసింది కదా?
మంద కృష్ణ వర్గీకరణను ఉద్యమంగా కాకుండా ఉద్యోగంగా భావించాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం బంద్ అయితున్నది. వర్గీకరణ చేస్తమని ఏ పార్టీ చెబితే ఆ పార్టీకి మద్దుతు ఇచ్చుకుంటూ ఇన్నేండ్లుగా వస్తున్నరు. ఇప్పుడు బీజేపీ కౌగిలిలో ఉండి ఆ పార్టీకి లాభం చేసే పనిలో నిమగ్నమ య్యారు. వర్గీకరణ కాగానే ప్రెస్ మీట్ పెట్టి మాదిగలకు 11 శాతం రావాలి, 9 శాతమే వచ్చింది అని అంటున్నరు. నిజానికి మాదిగలకు న్యాయం జరిగింది. వర్గీకరణ సాధ్యం అయిందనే సంతోషాన్ని ఆయన ఆవిరి చేస్తున్నడు.