- దానికి వివేక్ వెంకటస్వామి సారథ్యం వహించాలి
- మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ
- మాల, మాదిగల ఐక్యత కోసం కలిసి పని చేస్తామని వెల్లడి
బషీర్ బాగ్, వెలుగు: దళితుల రిజర్వేషన్ల పెంపు కోసం మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని, ఆ ఉద్యమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారథ్యం వహించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ పై చేసిన ప్రతిపాదనను మందకృష్ణ మాదిగ విభేదించడం సరికాదని పేర్కొన్నారు. చూస్తుంటే ఆయనకు వర్గీకరణ చేయడం ఇష్టం లేనట్టు ఉందన్నారు. మంద కృష్ణమాదిగకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చేయని ఏపీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘లక్ష డప్పులు, వేల గొంతుకలు’ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ మాదిగ మాట్లాడారు.
మాలల ఆత్మగౌరవం కోసం తాను కొట్లాడానని, వర్గీకరణకు వ్యతిరేకం కాదని అసెంబ్లీ లో వివేక్ వెంకటస్వామి మాట్లాడటం అభినందనీయం అని పేర్కొన్నారు. క్లిష్టమైన సమయంలో రిజర్వేషన్లు పెంచుకుంటే ఏ వర్గానికి ఇబ్బంది ఉండదని దళిత సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని చెప్పారు. రిజర్వేషన్ల పెంపునకు , మాల , మాదిగల ఐక్యతకు వివేక్ వెంకటస్వామి కార్యాచరణ తీసుకుంటే , మాదిగ హక్కుల దండోరా ఆయనతో కలిసి పని చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ , నాయకులు బుగ్గ మైసయ్య , అందె భవాని , మెతరీ రోజారాణి , ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.