ఐఎస్​ కోడ్స్​ ప్రకారమే మేడిగడ్డ డిజైన్లు

ఐఎస్​ కోడ్స్​ ప్రకారమే మేడిగడ్డ డిజైన్లు
  • విజిలెన్స్​ విచారణలో సీడీవో మాజీ సీఈ నరేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్)​ కోడ్స్​ ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు చేశామని సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​ (సీడీవో) రిటైర్డ్​ సీఈ నరేందర్​ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరుపుతున్న విజిలెన్స్​ డిపార్ట్​మెంట్.. బుధవారం నరేందర్​ రెడ్డిని విచారించింది. దేని ప్రకారం డిజైన్లు చేశారు? ఒకసారి ఇచ్చిన డిజైన్లలో మార్పులు ఎందుకు చేశారు? డిటెయిల్డ్​ ఫీల్డ్​ ఇన్​స్పెక్షన్​ చేశారా? వంటి ప్రశ్నలను విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ సంధించింది. డిజైన్ల మార్పుల్లో ఎవరి ప్రమేయం ఉందని అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే డిజైన్లు, ప్రాజెక్ట్​ డీపీఆర్​ను మార్చారని చెప్పినట్టు తెలిసింది. తనకు సంబంధం లేని అంశాలపై తన సంతకాలను తీసుకున్నారని అధికారులకు ఆయన వివరించినట్టు సమాచారం. ఫీల్డ్​ఆఫీసర్లు ఇచ్చిన టెస్టు రిపోర్టుల ప్రకారమే డిజైన్లను రూపొందించినట్టు చెప్పారని తెలిసింది. బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక రక్షణ చర్యలను చేపట్టలేదని వివరించారని తెలిసింది. నిర్మాణంలో క్వాలిటీని పట్టించుకోలేదని, హడావుడిగా పనులు చేయించారని అధికారులకు చెప్పినట్లు సమాచారం.