‘తెలంగాణలో ఫలించని బీజేపీ కుల అస్త్రం’ అనే పేరుతో సామాజిక శాస్త్రవేత్త ప్రొ.కంచ ఐలయ్య రాసిన వ్యాసంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమం మీద తన అక్కసునంతా వెళ్ళగక్కాడు. బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణ హామీలు బీజేపీకి ఓట్లు తీసుకురాలేదని చెప్పే ప్రయత్నంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దండోరా ఉద్యమాన్ని నడిపిస్తున్న మంద కృష్ణ మాదిగను అవహేళన చేస్తూ విశ్లేషణ కొనసాగించాడు.
గతంలో ఆయన “కోమట్లు సామాజిక స్మగ్లర్లు” అనే పుస్తకం రాయడాన్ని మంద కృష్ణ మాదిగ ఖండించిన విషయాన్ని మనసులో పెట్టుకొని తన అక్కసును, ఆక్రోశాన్ని వెళ్లగక్కినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ముప్పై ఏండ్లుగా మాదిగ జాతి ఆకాంక్షను భుజాలకెత్తుకొని మోస్తున్న సందర్భంగా ఎదురైన ఎన్నో ఆటుపోట్లను, అవాంతరాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న తీరును తలచుకొని మంద కృష్ణ భావోద్వేగానికి గురయ్యాడు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం ఏకంగా ప్రధానమంత్రిని కదిలించి ప్రత్యక్షంగా జాతి ముందుకు తీసుకువచ్చిన సందర్భంగా తీవ్ర భావోద్వేగంతో మంద కృష్ణ మాదిగ గుండెల నుండి కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఈ సంఘటనను చూసి మనసున్న ప్రతి ఒక్కరి గుండె చలించిపోయింది. మంద కృష్ణ మాదిగ కళ్ల నుంచి వచ్చిన కన్నీళ్లను చూసి పరేడ్ గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు, కన్నీటి విలువ మనసున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే కంచ ఐలయ్యకు మాత్రం మంద కృష్ణ ఇంట్లో ఎవరో చనిపోయినట్లు అనిపించిందట. ఇది ఏ రకమైన మేధావితనమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ మీద మాదిగలు యుద్దం చేసినప్పుడు స్పందించని ఐలయ్య.. ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వగానే వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
బీజేపీకే బీసీ, మాదిగల ఓట్లు
ఎమ్మార్పీఎస్ బీజేపీని సమర్థించడానికి ఒకే ఒక్క కారణం ఎస్సీ వర్గీకరణ డిమాండ్. విద్య, ఉద్యోగ, సంక్షేమ రాజకీయ రంగాల్లో ఎదగడానికి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ తప్ప మరో మార్గం లేదు. అందుకే ఎస్సీ వర్గీకరణ చేయడానికి ప్రధాన మంత్రి ముందుకి వచ్చినప్పుడు.. లక్షల మంది ప్రజల ముందే నో కాంగ్రెస్, నో బీఆర్‌ఎస్, మన పెద్దన్న మోదీకి అండగా ఉందామా అని మంద కృష్ణ మాదిగ అడగగానే పరేడ్ గ్రౌండ్‌లోని ప్రజలంతా లేచి చేతులెత్తి తమ మద్దతును తెలిపారు. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఏ కులం ఏ పార్టీ వైపు నిలిచింది అని చెప్పడానికి స్పష్టమైన, నిర్దిష్టమైన ఆధారాలు, నిష్పక్షపాతమైన విశ్లేషణలు కానీ లేవు. ఈ ఎన్నికలలో బీజేపీ కుల అస్త్రం పని చేయలేదని, బీసీలు, దళితులు బీజేపీకి ఓటు వేయలేదని చెప్తూనే, చీఫ్ గెస్ట్‌గా ప్రధానమంత్రి హాజరైన ఈ రెండు కులాల సమావేశాల వల్ల బీజేపీ 8 సీట్లు గెలుచుకుందని అన్నారు. ప్రధాని హాజరైన ఈ రెండు సభలలో ఒకటి వేల మంది బీసీలతో జరగగా, మరొకటి లక్షలాది మంది మాదిగలతో జరిగింది. మరి ఈ రెండు కులాల సభల వల్లే బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం నిజమైతే ఏ కులం కోసం ప్రధానమంత్రి వచ్చాడో ఆ కులానికి చెందిన బీసీలు, మాదిగలు ఏకపక్షంగా బీజేపీకి ఓట్లు వేయడం వల్లే 8 సీట్లును బీజేపీ గెలుచుకుందనేది విస్మరించలేని సత్యం.
మాదిగల మద్దతుతో బీజేపీ బలోపేతం
మాదిగల ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ వైపు చాలా మళ్లాయి. ఎమ్మార్పీఎస్ మాత్రమే బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ రెండు హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని ప్రచార అస్త్రాలుగా మలిచింది. తత్పలితంగానే బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికలతో పోల్చుకుంటే గణనీయంగా పెరిగింది. 2018 ఎన్నికలలో 6.98% ఓట్లు వస్తే ఈ ఎన్నికలలో 14% ఓట్లు వచ్చాయి. 28 స్థానాలలో బీజేపీని మాదిగలు బలంగా ప్రభావితం చేశారు. అందుకు సాక్ష్యంగానే బీజేపీ 8 స్థానాలలో గెలిచింది, 19 స్థానాలలో రెండవ స్థానంలో నిలిచింది. ఇది కళ్లముందు కనబడిన వాస్తవం. మాదిగలు 8% మాత్రమే బీజేపీకి ఓట్లు వేశారు అనేది శుద్ధ అబద్ధం. అంటే అన్ని పార్టీల ఓట్ల శాతం తగ్గితే కేవలం బీజేపీ ఓటు శాతం మాత్రమే పెరిగింది.
ఆ పెరిగిన ఓటు శాతంలో మేజర్ షేర్ మాదిగలదే అనేది విస్మరించలేని నిజం. ఎస్సీ వర్గీకరణను అన్ని కోణాల్లో అర్థం చేసుకున్న ప్రధాని మోదీ సాక్షాత్తూ మాదిగల విశ్వరూప సభకు వచ్చి లక్షల మంది ప్రజల ముందు బహిరంగ హామీ ఇచ్చారు. కంచ ఐలయ్య లాంటివారు సహేతుకత, శాస్త్రీయత లేని వ్యక్తిగత ఆక్రోశంతో వెళ్ళగక్కే విమర్శలు మానుకోవాలి. ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీకి ఎమ్మార్పీఎస్ రాజకీయంగా అండగా నిలబడింది. ఇదొక చారిత్రక అవసరం.
- గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు