
శంకర్పల్లి, వెలుగు : రాష్ట్రంలోని మాదిగలను సీఎం కేసీఆర్ రాజకీయంగా వాడుకొని, ఎదగనీయకుండా చేస్తుండని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో నిర్వహించిన చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ స్థాయి ముఖ్య నేతల సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రంలోని అగ్రకులాలు, మాలలు కలిసి మాదిగలను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలు అభివృద్ధి చెందుతారని అభిప్రాయపడ్డారు. వచ్చే నెల మూడో వారంలో ఎస్సీ వర్గీకరణపై దేశవ్యాప్తంగా ఉన్న మాదిగలతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
దీనికి సుమారు 10 లక్షల మంది రానున్నట్లు తెలిపారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 29 ఏండ్లుగా పోరాటం చేస్తోందని గుర్తుచేశారు. ఏ పార్టీలో చేరినా తనకు పదవులు వచ్చేవని..కానీ ఎస్సీలు ఎదగాలనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మాదిగల జనాభా రాష్ట్రంలో 11 శాతం ఉందని, మాదిగ కులానికి చెందిన వారికి మంత్రి పదవి ఎందుకు ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతమున్న10 మంది మాదిగ ఎమ్మెల్యేలు డమ్మీలుగా ఉన్నారని ఆయన విమర్శించారు.