- రాంపూర్, మడికొండ గ్రామాలను కమ్మేస్తున్న డంప్ యార్డు పొగ
- చీకటైందంటే పొగ ముసురుకుంటుండటంతో ఇబ్బందులు
హనుమకొండ, కాజీపేట, వెలుగు: గ్రేటర్ వరంగల్ లోని మడికొండ డంప్ యార్డుతో చుట్టుపక్కల గ్రామాలకు కష్టాలు తప్పడం లేదు. డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియ డెడ్ స్లోగా సాగుతుండగా, ఇక్కడి చెత్తను హుజురాబాద్‌లో ఏర్పాటు చేయనున్న 'వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్'కు తరలించే ప్రక్రియ ఇంకా కాగితాల దశలోనే ఉంది. ఫలితంగా డంప్ యార్డులో చెత్త గుట్టలు పెరిగిపోయి, రోజూ వచ్చే పొగతో చుట్టుపక్కల గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఘాటు వాసన, పొగ కమ్మేస్తుండటంతో ఊపిరి తీసుకోలేక, ఊరు విడిచివెళ్లలేక అవస్థలు పడాల్సివస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డు సమస్యను పరిష్కరించాలని దశాబ్ధ కాలంగా వేడుకుంటున్నా నేతలు పట్టించుకోవడం లేదని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
రూ.కోట్లు పెట్టినా తరగని చెత్త..
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్ల నుంచి నిత్యం 450 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడి చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఆ చెత్తతో ఇప్పటికే మడికొండ డంప్ యార్డు నిండిపోయింది. అక్కడ దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకుపైగా చెత్త పోగవగా, 3 లక్షల టన్నుల వరకు చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసేందుకు ఓ కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. 2021లోనే రూ.37కోట్లతో బయోమైనింగ్‌కు శ్రీకారం చుట్టగా, ఏడాదిలోనే టార్గెట్పూర్తి చేయాల్సి ఉంది. కానీ, బడ్జెట్ ఇష్యూస్, వర్షాలు, ఇతర కారణాలతో పనులు డెడ్ స్లోగా సాగుతూ రాగా, ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే పూర్తయింది. దీంతో ఇటీవల గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే బయో మైనింగ్ ప్లాంట్‌ను సందర్శించి, రెండు నెలల్లో వంద శాతం ప్రాసెసింగ్పూర్తిచేయాలని టార్గెట్పెట్టారు.
Also Read :- పల్లె పోరుకు అంతా సిద్ధం
డంప్‌యార్డులో గతంలో పోగైన చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తుండగా, కొత్తగా వెలువడుతున్న వేస్టేజీ సమస్యగా మారింది. కాగా, ప్రభుత్వం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 25 ఎకరాల్లో 'మెగా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్' ఏర్పాటు చేస్తుండగా, ఇక్కడి చెత్తలో 518.62 టన్నుల మేర అక్కడికి తరలించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయితే వరంగల్ లో డంప్ యార్డు సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ఉంది. కానీ, ఆ ప్రక్రియ ఇంకా కాగితాల దశలోనే ఉండటం, కొత్త యార్డుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగకపోవడంతో మడికొండ డంప్ యార్డులో చెత్త గుట్టలు పేరుకుపోతున్నాయి.
రాత్రయితే పొగ, ఘాటు వాసన..
ప్రతిరోజు రాత్రి డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ మడికొండ, మినీ టెక్స్‌టైల్‌పార్క్, రాంపూర్, ఎలుకుర్తి, మోడల్‌కాలనీ, సోమిడి శివారు, రింగ్ రోడ్డు పరిసరాలను కమ్మేస్తోంది. ఆ పొగతోపాటు ఘాటు వాసనలు వస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మడికొండ, రాంపూర్‌లో సమస్య ఎక్కువగా ఉండగా, పొగ వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు.
ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రజలు..
గ్రేటర్ వరంగల్ లో డంప్‌యార్డు సమస్య తీవ్రంగా మారగా, దానిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని దాదాపు దశాబ్ధకాలంగా రాంపూర్, మడికొండ ప్రజలు డిమాండ్చేస్తున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వ పెద్దలకు సమస్యను వివరించి, వినతి పత్రాలు కూడా అందించారు. సమస్య పరిష్కారం కాకపోవడం, తరచూ పొగ వల్ల ఇబ్బందులు తలెత్తుతుండటంతో చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా మడికొండ, రాంపూర్ ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు కార్యాచరణ రూపొందించేందుకు మడికొండ జడ్పీ హైస్కూల్లో ఆదివారం సమావేశం కానున్నారు. పార్టీలకతీతంగా మీటింగ్ నిర్వహించి, పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇకనైనా లీడర్లు, ఆఫీసర్లు తగిన పరిష్కారం చూపకపోతే కార్యాచరణ రూపొందించి ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు.