- చుట్టుపక్కల ఊళ్లకు వ్యాపిస్తుండటంతో ఇబ్బందులు
- డెడ్ స్లోగా నడుస్తున్న బయో మైనింగ్ ప్రక్రియ
- రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా వదలని సమస్య
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగర ప్రజలకు మడికొండ డంప్ యార్డు శాపంగా మారింది. రెండేండ్ల కిందట చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ స్లోగా నడుస్తుండటం, చెత్తను శుద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టులు కాగితాల దశ దాటకపోవడం సమస్యగా మారగా.. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకు అక్కడి సిబ్బంది రోజూ సాయంత్రం నిప్పు పెడుతున్నారు. ఫలితంగా రాత్రి 8 దాటిందంటే ఆ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల ప్రజలు పొగ ఘాటుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బయోమైనింగ్ కాలే.. ప్రాజెక్టులు పట్టాలెక్కలే
వరంగల్ నగరంలోని 66 డివిజన్ల పరిధిలో 2.25 లక్షల ఇండ్లు ఉండగా.. సుమారు 11 లక్షల జనాభా నివసిస్తోంది. రోజువారీగా తడి, పొడి చెత్త అంతా కలిపి 450 నుంచి 500 టన్నుల వరకు వెలువడుతోంది. ఈ చెత్తనంతా మడికొండ-రాంపూర్ గ్రామాల సమీపంలోని డంప్ యార్డుకు తరలిస్తుండగా.. ఇప్పటికే అక్కడ ఆరు లక్షల మెట్రిక్ టన్నులకుపైగా చెత్త పోగైంది. దీంతో అక్కడున్న దాంట్లో 3 లక్షల టన్నులను శుద్ధి చేసేందుకు రెండేండ్ల కిందట 2021లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.37 కోట్లతో బయో మైనింగ్ చేపట్టారు.
ఏడాదిలోనే బయో మైనింగ్ పూర్తి కావాల్సి ఉండగా.. బిల్లులు, వర్షాలు తదితర సమస్యల కారణంగా ఇప్పటివరకు 1.87 లక్షల టన్నుల చెత్త మాత్రమే శుద్ధి చేశారు. డైలీ ఇక్కడ 2 వేల టన్నులే ప్రాసెస్ అవుతుండగా.. రోజువారీగా పోగవుతున్న చెత్తతో డంప్ యార్డు నిండిపోతోంది. జీడబ్ల్యూఎంసీలో వెలువడుతున్న చెత్తకు పరిష్కారం చూపేందుకు గతంలో వివిధ రకాల ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆఫీసర్లు ప్రణాళికలు రూపొందించారు. బయో మైనింగ్ కు సమాంతరంగా చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే ప్రాజెక్టుకు మూడేండ్ల కిందటే ప్రపోజల్స్ రెడీ చేశారు.
ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రీసోర్సెస్ ధన్(గోబర్ ధన్) స్కీం కింద బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుకు కసరత్తు చేశారు. అవేవీ పట్టాలెక్కలేదు. ఈ క్రమంలోనే పది రోజుల కిందట దక్షిణ కొరియాకు చెందిన సేజింగ్ అనే కంపెనీ ల్యాండ్ ఫిల్ గ్యాస్ ద్వారా చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తికి ముందుకొచ్చింది. కానీ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత చెత్త ప్రాసెసింగ్, విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని చెప్పింది. దీంతో ఆ ప్రక్రియ మొదలవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
రాత్రయ్యిందంటే చుట్టూ పొగే
చెత్త ప్రాసెసింగ్‌కు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కపోవడం, కొత్తగా జమవుతున్న వ్యర్థాలతో మడికొండ డంప్ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో అక్కడి సిబ్బంది చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఫలితంగా రాత్రి 8 దాటిందంటే చాలు డంప్ యార్డు నుంచి వచ్చే పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేస్తోంది. బుధవారం రాత్రి కూడా ఇలాగే నిప్పుపెట్టడంతో ఆ పొగ మడికొండ, రాంపూర్, ఎలుకుర్తి, ధర్మసాగర్ వరకూ వ్యాపించింది.
ఫలితంగా ఘాటు వాసనలతో అక్కడి జనాలు, శ్వాస కోష వ్యాధులున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగ వల్ల రింగ్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు డంప్ యార్డును ఆనుకుని ఉన్న మినీ టెక్స్ టైల్ పార్క్ కార్మికులు రాత్రయితే ముక్కు మూసుకుని పని చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కాగా డంప్ యార్డును అక్కడి నుంచి తరలించడమో లేదా సమస్యకు పరిష్కారం చూపడమో చేయాలని ఆ చుట్టుపక్కల ప్రజలు కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు రోడ్డెక్కి ఆందోళనలు కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇకనైనా డంప్ యార్డు సమస్యకు పరిష్కారం చూపాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పొగ ఊరంతా కమ్మేస్తాంది
డంప్ యార్డు నుంచి వచ్చే పొగ మా ఊరిని కమ్మేస్తాంది. ఆ ఘాటు వాసనల వల్ల దగ్గు, దమ్ము రావడమే కాకుండా శ్వాసకు కూడా ఇబ్బంది అయితాంది. ఎండాకాలం గాలి కోసం బయట ఉండే పరిస్థితి లేకుండా పోతాంది. డంప్ యార్డును ఊళ్లకు దూరంగా తరలించాలి.
- కొలిపాక కుమారస్వామి, ఎలుకుర్తి
సాయంత్రమైతే పొగ మసకే
సాయంత్రమైతే చాలు డంప్ యార్డు పొగ మాదాకా వస్తోంది. ఈ మధ్య ప్రతిరోజు ఇదే సమస్యే ఎదురవుతోంది. డంప్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని చాలాసార్లు విన్నవించినం. అయినా ఎవరూ పట్టించుకుంటలేరు.
- గడ్డం నవీన్, మోడల్ కాలనీ, ధర్మసాగర్