- మడికొండ టెక్స్ టైల్ అండ్ వీవర్స్ సొసైటీలో నిధుల గోల్ మాల్
- అరకొర పనులు చేసి ఫండ్స్ డ్రా చేసిన బిల్డర్స్
- రూ. 65 కోట్లు పక్కదారి పట్టాయంటున్న లబ్ధిదారులు
- ఈఎంఐల భారానికి తోడు ఉత్పత్తి లేక మూతపడుతున్న కంపెనీలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్వరంగల్ పరిధి కాజీపేట మండలం మడికొండలోని మినీ టెక్స్ టైల్పార్క్లో ఒక్కో ఇండస్ట్రీ మాతపడుతోంది. ఓ వైపు లబ్ధిదారులకు తెలియకుండానే నిధులు కాజేయడం, మరో వైపు చీరలు, దుప్పట్లు ఉత్పత్తి చేసే ముడి సరుకుకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో లబ్ధిదారులు తమ కంపెనీలకు తాళాలు వేస్తున్నారు.
ఎంఎస్ఎంఈ కింద 164 యూనిట్లు
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రిఫరెన్స్ తో సీజీటీఎంఎస్ఈ (క్రెడిట్గ్యారంటీ ఫండ్ట్రస్ట్ఫర్మైక్రో అండ్ స్మాల్ఎంటర్ప్రైజెస్) కింద చేనేత కార్మికులకు పవర్లూమ్ఇండస్ట్రీలు మంజూరు చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 364 మంది చేనేత కార్మికులు కాకతీయ టెక్స్ టైల్అండ్వీవర్స్వెల్ఫేర్పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘం లిమిటెడ్పేరున సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పవర్లూమ్ఇండస్ట్రీల ఏర్పాటు కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండలో సుమారు 60 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ సొసైటీలో ఒక్కో యూనిట్ కు 500 గజాల వరకు స్థలాన్ని తక్కువ రుసుముకే ఇచ్చారు. ఒక్కో యూనిట్కాస్ట్మెషీన్, కంపెనీని బట్టి రూ.1.4 కోట్ల వరకు ఉండగా, సీజీటీఎంఎస్ఈ కింద రూ.92.5 లక్షల నుంచి రూ.98.3 లక్షల వరకు కెనరా బ్యాంక్హనుమకొండ, వరంగల్ బ్రాంచ్ల ద్వారా లోన్ సదుపాయం కల్పించారు. మిగతా అమౌంట్ ను మార్జిన్మనీ కింద లబ్ధిదారులు పెట్టుబడిగా పెట్టారు. ఇలా ఇక్కడ మొత్తం 164 మంది కంపెనీలు ఏర్పాటు చేశారు.
అరకొర పనులతో ఫండ్స్ఖతం
ఇండస్ట్రీ డీపీఆర్ప్రకారం సిమెంట్ ఇటుకలతో షెడ్ ఏర్పాటు చేసి చుట్టూ కాంపౌండ్, గేట్, కలర్డ్రూఫ్, ఫ్లోర్, విండోస్, షట్టర్స్, మోటార్సెట్, ఆఫీస్రూమ్, ఫర్నీచర్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆయా పనులకు రూ.17 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండగా పనులు చేసిన కాంట్రాక్టర్, తనకు గిట్టుబాటు కావడం లేదంటూ బిల్లును రూ.45 లక్షల వరకు పెంచుకుంటూ వచ్చారు. ఆ తరువాతనైనా ఒప్పందం ప్రకారం అన్ని పనులు చేయాల్సినప్పటికీ 2019 మార్చిలో వర్క్స్స్టార్ట్చేసినా ఇంతవరకూ పూర్తి చేయలేదు. అంతేగాకుండా లబ్ధిదారుల సంతకాలు ఉన్న జీరాక్స్పేపర్లు పెట్టి ఒక్కో యూనిట్ కు రూ.45 లక్షల బిల్లులు విత్డ్రా చేశారు. షెడ్ నిర్మించే క్రమంలో బిల్డర్లు ఎవరు ? నిర్మాణానికి ఖర్చు ఎంత ? అసలు దానిని ఎలా నిర్మిస్తున్నారన్న విషయాన్ని తమకు చెప్పకుండానే పనులు చేపట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా లబ్ధిదారులకు చైనా, సూరత్నుంచి మెషీన్లు తెప్పించే పనులు కూడా సొసైటీ డైరెక్టర్లే చూసుకోగా తమకు కొత్త మెషీన్లకు బదులు పాత మెషీన్లను అప్పగించి, ఫండ్స్మింగేశారని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇలా ఒక్కో యూనిట్ కాస్ట్పేరున సగటున రూ.40 లక్షల వరకు ఫ్రాడ్ జరిగినట్లు చెబుతుండగా.. మొత్తం 164 మంది లబ్ధిదారుల పేరున దాదాపు రూ.65 కోట్లు నొక్కేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ డైరెక్టర్లు, బ్యాంకు ఆఫీసర్లు, బిల్డర్లు, కుమ్మక్కై కంపెనీలకు సంబంధించిన మొత్తం ఫండ్స్ ను తమకు తెలియకుండానే డ్రా చేశారని ఆరోపిస్తున్నారు.
విచారణ జరపాలని వేడుకోలు
మడికొండ టెక్స్టైల్సొసైటీలో అక్రమాలపై విచారణ జరపాలని లబ్ధిదారులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొద్దిరోజుల కిందట సొసైటీ పాలకవర్గం, బిల్డర్లు, బ్యాంకర్లు, అధికారుల తీరుపై ప్రజాదర్బార్లో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. హనుమకొండ కలెక్టర్, డీసీవో, వరంగల్ సీపీకి కూడా కంప్లైంట్చేశారు. మడికొండ మినీ టెక్స్ టైల్ పార్క్ లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అలాగే కమిటీ గడువు పూర్తై ఏండ్లు గడుస్తుండడంతో వెంటనే ఎన్నికలు జరపాలని కలెక్టర్ తో పాటు డీసీవో వినతిపత్రాలు ఇచ్చారు.
మూతపడుతున్న కంపెనీలు
ఇండస్ట్రీ ఏర్పాటు తర్వాత బిల్లులు రిలీజ్చేసే సమయంలో బ్యాంక్ఆఫీసర్లు ఫీల్డ్విజిట్ చేసి, అంతా సక్రమంగా ఉన్నప్పుడే సంబంధిత అమౌంట్ ను కాంట్రాక్టర్ కు రిలీజ్చేయాలి. లబ్ధిదారుల ఖాతా నుంచి బిల్డర్లకు అమౌంట్ట్రాన్స్ఫర్చేయడానికి ఇద్దరి మధ్య ఎంవోయూ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ అది కూడా లేకుండానే తమ సంతకాలను ఫోర్జరీ చేసి, నిధులను నేరుగా బిల్డర్లకు ట్రాన్స్ఫర్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పూర్తి అమౌంట్ బిల్డర్లకు రిలీజ్చేయడంతో తమ ఇండస్ట్రీల్లో ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 164 యూనిట్లలో గతంలోనే 100 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభం కాగా ఇప్పుడు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కరోనా సమయంలో కొన్ని మూతపడగా.. రెండేండ్ల కిందటి వరకు 20 కంపెనీలు రన్నింగ్ లో ఉండేవి. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా అందులో సగం కూడా మూతపడ్డాయి.
ఆత్మహత్యలు తప్పేలా లేవు
మినీ టెక్స్టైల్పార్క్ లో కంపెనీ ఏర్పాటుకు అప్పులు చేసి మరీ మార్జిన్మనీ కట్టినం. ఆ తర్వాత లబ్ధిదారులకు తెలియకుండానే నిధులు కాజేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం. ఉపాధి కోసం కంపెనీ పెట్టుకుంటే.. ఉత్పత్తి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మినీ టెక్స్టైల్ పార్క్లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి న్యాయం చేయాలి.
పగడాల లక్ష్మీ నారాయణ, లక్ష్మీదేవి టెక్స్ టైల్స్