- సబలెంకతో టైటిల్ ఫైట్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్‌కు.. 19వ సీడ్ మాడిసన్ కీస్ ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో కీస్ (అమెరికా) 5–7, 6–1, 7–6 (10/8)తో వరల్డ్ రెండో ర్యాంకర్ స్వైటెక్‌ను ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు గంటలా 32 నిమిషాల పోరాటంలో మూడో సెట్‌లో మ్యాచ్ పాయింట్ కాచుకున్న కీస్ టైబ్రేక్‌లో అద్భుతం చేసింది. అమెరికన్ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా, 2017లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ ఆడింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కీస్.. తొలి గేమ్‌లోనే స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఈ టోర్నీలో స్వైటెక్ సర్వీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. తర్వాత ఇద్దరు బ్రేక్ పాయింట్లను కాపాడుకుంటూ ముందుకు సాగారు. దాదాపు 49 నిమిషాల తర్వాత రెండో సెట్ పాయింట్‌లో నెగ్గిన స్వైటెక్ సెట్‌ను చేజిక్కించుకుంది. రెండో సెట్‌లో మరింత దూకుడుగా ఆడిన కీస్.. స్వైటెక్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలిచింది.
ఇక డిసైడర్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. సర్వీస్‌ల్లో ఆధిపత్యం చూపెడుతూ బేస్ లైన్ గేమ్‌తో పాయింట్లను పంచుకున్నారు. చివరకు మూడో సెట్ లాస్ట్ గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్న కీస్ టైబ్రేక్‌కు వెళ్లింది. బలమైన క్రాస్ కోర్టు విన్నర్లతో రెచ్చిపోయిన కీస్ తొలి 10 పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరో సెమీస్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 6–4, 6–2తో పౌలా బడోసా (స్పెయిన్)ను ఓడించింది.