- మద్రాస్ హైకోర్టు కామెంట్
- యువకుడిపై నమోదైన కేసు కొట్టివేత
చెన్నై: ప్రేమలో ఉన్న టీనేజర్లు ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం సహజమేనని, దానిని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఓ యువకుడిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసింది. 21 ఏండ్ల యువకుడు, 19 ఏండ్ల అమ్మాయి 2020 నుంచి ప్రేమలో ఉన్నారు. ఇద్దరం ఒకచోట కలుద్దామని యువతిని యువకుడు ఒకరోజు అడిగాడు. ఆరోజు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు వారిద్దరు మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో యువతి సమ్మతించకున్నా యువకుడు ఆమెను కౌగిలించుకున్నాడు. ముద్దుపెట్టుకున్నాడు. దీంతో ఈ విషయం ఆమె తన పేరెంట్స్ కు చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది. అప్పటి నుంచి యువకుడు ఆమెను దూరం పెట్టాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. తనపై వేసిన కేసును కొట్టివేయాలని యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసును న్యాయస్థానం విచారించింది. శారీరకంగా ఆ యువతితో కలిస్తే యువకుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టవచ్చు.. అంతేకానీ కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడాన్ని నేరంగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. రొమాంటిక్ లవ్లో ఉన్న టీనేజర్లు హగ్, కిస్ చేసుకోవడం సహజమేనని పేర్కొంది. యువకుడిపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేసింది.