నటి కస్తూరికి షాకిచ్చిన మద్రాసు హైకోర్టు.. ముందస్తు బెయిల్‌ నిరాకరణ

నటి కస్తూరికి షాకిచ్చిన మద్రాసు హైకోర్టు.. ముందస్తు బెయిల్‌ నిరాకరణ

సీరియల్ నటి కస్తూరికి మద్రాసు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నటి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ ఆనంద్ వెంకటేష్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ గురువారం(నవంబర్ 14) కొట్టివేసింది. 

కొన్నిరోజుల క్రితం కస్తూరి తమిళనాడులోని తెలుగు కమ్యూనిటీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 3న చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సమావేశంలో మాట్లాడిన ఆమె.. తమిళ రాజుల వేశ్యలకు సేవ చేసేందుకు తమిళనాడుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమిళ జాతికి చెందిన వారని చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించింది. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది. 

తన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగడంతో నటి క్షమాపణలు చెప్పింది.  తాను తెలుగు వారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపింది. అయినా ఫలితం లేకుండా పోయింది. కస్తూరిపై చెన్నైలో ఇదే విషయమై కేసులు నమోదయ్యాయి. నాయుడు మహాజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తిరునగర్ పోలీసులు BNS సెక్షన్ 196(1)(a), 197(1)(c), 296(b), 352, 353(3) సెక్షన్‌తో పాటు ఐటీ చట్టంలోని 67 కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

Also Read : వరుణ్ తేజ్ మట్కా ట్విట్టర్ రివ్యూ

ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కస్తూరి ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసమంజసమైనవని, కస్తూరి తెలుగు సమాజంలోని మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోవాలని  మౌఖికంగా వ్యాఖ్యానించింది. రాజకీయ వ్యాఖ్యాతగా చెప్పుకునే కస్తూరి క్షణికావేశంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరాదని కోర్టు పేర్కొంది.