కారు బానెట్ పై.. మహిళను అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన పోలీసులు

కారు బానెట్ పై.. మహిళను అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన పోలీసులు

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తన కుమారుడిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న  ఓ తల్లిని పోలీసులు కారు బానెట్ పై 500 మీటర్ల దూరం తరలించడం  సంచలనం సృష్టించింది. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్​ మీడియాలో షేర్ చేశారు. కొన్ని గంటల్లో ఇది వైరల్​గా మారింది. ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగ్​పూర్​జిల్లాలోని గోటేగావ్​లో డ్రగ్స్​ స్మగ్లింగ్​ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.  సమాచారం మేరకు డ్రగ్స్​ సరఫరా చేస్తూ అనుమానాస్పదంగా కనిపించిన సోనుకహర్​ నివాసంపై పోలీసులు దాడి చేశారు. అతని ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న నిందితుడి తల్లి మోహిని కహర్​ సంఘటనా స్థలానికి చేరుకుని తన కుమారుడిని అరెస్ట్​ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. 

అతడ్ని విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ.. పోలీసులు ఉన్న కారు బానెట్​పై నిల్చుంది. అధికారులు పై నుంచి దిగాలని కోరినా.. కుమారుడిని వదిలే వరకు తాను దిగబోనని అధికారులతో చెప్పింది. చివరికి పోలీసులు బానెట్​పై ఉండగానే.. ఆమెను 500 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్​ స్టేషన్​వరకు తరలించారు. ఈ దృశ్యాలను ఒకరు వీడియో తీసి సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశారు. వీడియో కాస్త వైరల్​ కావడంతో ఎస్పీ అనిల్​ అజ్మీరియా కేసు దర్యాప్తు చేయాలని డిప్యూటీ ఎస్పీని ఆదేశించారు. వారు సమర్పించిన నివేదిక ఆధారంగా ఘటనకు కారణమైన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్​ చేశారు. ఆరోపణలు రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నర్సింగాపూర్​ ఎస్​డీఓపీ భావనా మరావి తెలిపారు.