
హైదరాబాద్, వెలుగు: డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మాజిలానిక్ క్లౌడ్ సంస్థ దేశీయంగా 200 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలిగే కార్గో డ్రోన్ కార్గోమ్యాక్స్ 200 కేహెచ్సీని ఆవిష్కరించింది. దీనిని వాణిజ్య అవసరాలకు వాడతామని తెలిపింది. ఇది భారీ సరుకులను మోసుకెళ్ల గలుగుతుంది. పెద్ద బ్యాటరీ వల్ల ఎక్కువసేపు ప్రయాణిస్తుంది. జీపీఎస్, నావిగేషన్ వల్ల గమ్యస్థానాన్ని కచ్చితంగా గుర్తిస్తుంది. ఇదిలా ఉంటే, మాజిలానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో (ఎన్ఎస్ఈ) లిస్టయింది. ఈ నేపథ్యంలో తదుపరి దశ వృద్ధిని వేగవంతంగా సాధించడంపై దృష్టి పెడుతోంది.
పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే ఏఐ ఆధారిత అవకాశాలపై మరింతగా దృష్టి సారిస్తున్నామని ప్రకటించింది. ఈ-సర్వైలెన్స్, స్కానలిటిక్స్ లాంటి వీడియో అనలిటిక్స్ సొల్యూషన్స్, డీప్-టెక్ సొల్యూషన్స్ మొదలైన వాటిల్లో కార్యకలాపాలను విస్తరిస్తున్నామని తెలిపింది. కొత్త కంపెనీలను కొనుగోలు చేస్తామని, ఇందు కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తామని మాజిలానిక్ క్లౌడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ తెలిపారు.