జాతరలు షురూ.. జన సంద్రమైన సింగరాయ జాతర

జాతరలు షురూ.. జన సంద్రమైన సింగరాయ జాతర
  • పుల్లూరుబండకు పోటెత్తిన జనాలు 
  • గుబ్బడిగుట్టల్లో భక్తుల కోలాహలం 

కోహెడ/ సిద్దిపేట/నంగునూరు, వెలుగు: మాఘ అమావాస్య రోజున జిల్లాలో పలుచోట్ల జాతరలు అట్టహాసంగా మొదలయ్యాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల శివారులో సింగరాయ గుట్టలు జనసంద్రంగా మారాయి. నంగునూరు మండలం పాలమాకులలోని గుబ్బడి గుట్ట జాతర, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండ జాతరకు భక్తులు పోటెత్తారు. కూరెళ్ల దగ్గర మోయతుమ్మెద వాగు పక్కన ప్రశాంత వాతావరణంలో జరిగే సింగరాయ జాతరకు లక్ష మంది భక్తులు హాజరయ్యారు. సింగరాయ లక్ష్మి నర్సింహ స్వామి గోవిందా నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది.

మోయతుమ్మెద వాగులో స్నానాలు చేసిన భక్తులు గుట్ట సోరికెలో ఉన్న స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

డీపీవో దేవకిదేవి, ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్​ సురేఖ, ఎంపీడీవో కృష్ణయ్య స్వామి వారిని దర్శించుకున్నారు. ఈసారి రెండు గ్రామాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా జాతర ఏర్పాట్లు అధికారులే జేశారు. ఆలయం దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేయకపోవడంతో తోపులాట జరిగింది. స్వామి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. భక్తులకు కనీసం మంచి నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. 

సిద్దిపేట రూరల్‌‌‌‌ మండలం పుల్లూరులో వంద ఎకరాల్లో ఉన్న బండపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి వంశపారంపర్య అర్చకులు రంగాచార్యులు పూజలు చేశారు. ఆలయ ఉత్సవ కమిటి చైర్మన్ కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

నంగునూరు మండలం పాలమాకులలోని గుబ్బడి గుట్ట జాతరలో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం ఏడాదికి ఒకసారి మాఘ అమావాస్యనాడు తెరుస్తారు. ఉదయం ఆలయ ధర్మకర్తలు చీకోటీ వంశస్తులు బుధవారం ఉదయం స్వామి వారికి అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వామివారి దర్శనం కొనసాగింది. వివిధ ప్రాతాల నుంచి వచ్చిన భక్తులు గుండంలో పుణ్య స్నానాలు చేశారు.