మ్యూజిక్​తో మొక్కల్లో మ్యాజిక్.. మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతున్న సంగీతం..

మ్యూజిక్​తో మొక్కల్లో మ్యాజిక్.. మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతున్న సంగీతం..
  • ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి
  • భవిష్యత్తులో పంటల దిగుబడి పెంచేందుకు వీలు!

పారిస్: సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని లోకోక్తి.. దానిమాటెలా ఉన్నా మొక్కల పెరుగుదలకు మాత్రం సంగీతం బాగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. మంద్రస్థాయిలో సంగీతం వినిపిస్తే మొక్కల పరిసరాల్లోని ఒక రకమైన ఫంగస్​ చురుకుగా మారి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుందని ఆస్ట్రేలియా సైంటిస్టులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. దీంతో పంటలు, పళ్లతోటలకు సంగీతం వినిపించి మంచి దిగుబడి రాబట్టే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మంద్రస్థాయిలో వినిపిస్తే..

అడవుల నరికివేత, కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సహా వివిధ కారణలతో కొన్ని రకాల మొక్కలు, భవిష్యత్తులో కొన్ని పంటలు మాయమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తోందని, దీనిని సరిదిద్దేందుకు మొక్కలను విరివిగా పెంచాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ సైంటిస్టు జేక్ రాబిన్సన్ చెప్పారు. మొక్కల ఎదుగుదలకు సంబంధించి తాము చేపట్టిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడిందన్నారు. పిల్లలకు జోలపాట పాడిన తరహాలో సంగీతం వినిపిస్తే మొక్కల్లో ఉండే ట్రైకోడెర్మా హర్జియానమ్ ఫంగస్ యాక్టివేట్ అవుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఫంగస్ మొక్కల ఎదుగుదలకు, చీడపీడల నివారణకు, భూసారాన్ని పెంచి మొక్కలు ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు.

ఫంగస్​లో చురుకుదనం..

సంగీతాన్ని వినిపించినపుడు ఈ ఫంగస్ చురుకుదనం సంతరించుకోవడం గమనించామని, నిశ్శబ్దంగా ఉండే పరిసరాల్లో పెంచిన మొక్కలకన్నా ఈ మొక్కల్లో ఎదుగుదల వేగంగా ఉందని తెలిపారు. ప్రయోగంలో భాగంగా 80 డెసిబెల్స్ స్థాయిలో రోజుకు అరగంట పాటు మొక్కలకు ప్రకృతిలో సహజంగా వినిపించే శబ్దాలను ప్రత్యేకమైన స్పీకర్ల ద్వారా ప్లే చేశామని వివరించారు. ఐదు రోజుల తర్వాత చూస్తే మొక్కల ఎదుగుదల సాధారణం కంటే ఎక్కువున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని, భవిష్యత్తులో దీంతో పంటల దిగుబడి, భూసారాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుందని ఆస్ట్రేలియా సైంటిస్టులు పేర్కొన్నారు. జర్నల్ బయాలజీ లెటర్స్ ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది.