- మెజిషియన్ వసంత్ కుమార్ మృతి
- కేటీఆర్‌కు ట్వీట్ చేసినా ఎవరూ స్పందించలేదన్న మృతుని సోదరుడు
- సాయం కోసం కేటీఆర్‌కు ట్వీట్.. ఎవరూ స్పందించకపోవడంతో మృతి
కరీంనగర్: హుజురాబాద్‌కు చెందిన మెజిషియన్ జంబో అలియాస్ వసంత కుమార్ బ్లాక్ ఫంగస్‌తో గాంధీ ఆస్పత్రిలో ఆదివారం మృతిచెందాడు. గణేష్ నగర్‌కు చెందిన మెజిషియన్ వసంతకుమార్ ఈనెల 13న కరోనా పాజిటివ్‌తో కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వారం రోజుల పాటు వైద్యం అందించిన డాక్టర్లు.. బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నాయని గాంధీ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. దాంతో ఈనెల 21న కుటుంబ సభ్యులు వసంత కుమార్‌ను గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు, వైద్య సిబ్బంది పట్టించుకోలేదని.. అందువల్లే వసంత్ మే 23న సాయంత్రం చనిపోయాడని మృతుని సోదరుడు, తల్లి ఆరోపించారు. వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే.. ఆ ట్వీట్‌ను 50 వేల మంది షేర్ చేశారు. అయితే ఆ ట్వీట్‌కు మంత్రి నుంచి గానీ, మరెవరి నుంచైనా గానీ స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న లాంటి వారు ఎందరో గాంధీ ఆస్పత్రిలో ఉన్నారని, వారికైనా సరైన చికిత్స అందించి బతికించాలని వసంత్ సోదరుడు కోరారు.