వైభవంగా సంప్రోక్షణ పూజలు.. యాదగిరిగుట్టకు చేరుకున్న నదీ జలాలు

వైభవంగా సంప్రోక్షణ పూజలు.. యాదగిరిగుట్టకు చేరుకున్న నదీ జలాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపుర ‘మహాకుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం యాగశాలలో ‘పంచకుండాత్మక సుదర్శన నారసింహ యాగాన్ని’ నిర్వహించారు. 

ఉదయం స్వామివారిని ప్రధానాలయం నుంచి తిరువీధి సేవ ద్వారా యాగశాల ప్రదేశానికి తీసుకువచ్చి వేదపండితులు మంత్రోచ్ఛారణలు, వేద ఇతిహాసాది పురాణ స్తోత్ర పారాయణాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ గోపురాలపై ఏర్పాటు చేసే స్వర్ణ కలశాలను అద్దంలో చూపి వాటి ప్రతిబింబాలకు పవిత్రమైన జలం, పాలతో అభిషేకం నిర్వహించారు.

నారసింహుడి చెంతకు చేరిన ‘నదీ జలాలు’
ఈనెల 23న దివ్యవిమాన స్వర్ణ గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్న నేపథ్యంలో దేశంలోని వివిధ నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు గురువారం యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకున్నాయి. వెండి కలశాలలో సేకరించి తెచ్చిన నదీజలాలను యాగశాలలో ఏర్పాటు చేసిన కుంభంలో పోసి ప్రత్యేక పూజలు చేశారు.