ఘనంగా ఖమ్మం పీఠం బిషప్ .. సగిలి ప్రకాశ్​ అభిషేక మహోత్సవం

  • ఆయా రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు, మత గురువులు హాజరు  

ఖమ్మం రూరల్, వెలుగు : ఆర్సీఎం ఖమ్మం పీఠం బిషప్ గా సగిలి ప్రకాశ్​అభిషేక మహోత్సవం మంగళవారం ఖమ్మం రూరల్​ మండలం నాయుడుపేట కరుణగిరి కేథడ్రల్ చర్చి ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ఇన్ చార్జ్​ బిషప్ డాక్టర్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు  వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు, మత గురువుల మధ్య  కనుల పండువగా జరిగింది. 

ఆర్సీఎం విశ్వ గురువు  పోపు ఫ్రాన్సిస్, కడప పీఠానికి చెందిన గురువు సగిలి ప్రకాశ్​ను ఖమ్మం నూతన పీఠాధిపతిగా నియమించి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ అభిషేక మహోత్సవాన్ని హైదరాబాద్ అగ్ర పీఠాధిపతి కార్డినల్ ఆర్చ్ బిషప్ పూల అంథోని, సహ అభిషేక పీఠాధిపతులుగా కడప పీఠ పాలనాధికారి బిషప్ గాలిబాలి, వరంగల్ పీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాలలు  సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 

భారత దేశ పోపు  ప్రతినిధి సెక్రటరీ కేవియన్ జాయింట్ జస్టిస్ లాటిన్ భాషలో నూతన బిషప్ ప్రమాణ పత్రాన్ని అందించగా, బిషప్ సగిలి ప్రకాశ్​కు సకల పునీతుల ప్రార్థన అనంతరం ప్రమాణం చేశారు. ఈ వేడుకలో ఆయా ప్రాంతాల నుంచి మత గురువులతోపాటు దాదాపు 15వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మత గురువులు జోసెఫ్ రాజారావు, పొలే మేర జయరావు, రాయిరాల విజయ్ కుమార్, మల్లవరపు ప్రకాశ్, మైపన్ పాల్, మాథ్యూ వరప్రసాద్ రాజు, తప్పెట శౌరి పాల్గొన్నారు.