మయన్మార్ లో మళ్లీ భూకంపం : తీవ్రత 5.3.. ఊగిపోయిన భవనాలు

మయన్మార్ లో మళ్లీ భూకంపం : తీవ్రత 5.3.. ఊగిపోయిన భవనాలు

24 గంటలు గడవక ముందే మయన్మార్ దేశం మళ్లీ వణికిపోయింది. మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.3గా నమోదైంది. 2025, మార్చి 29వ తేదీ శనివారం మధ్యాహ్నం ఇండియా టైం ప్రకారం 3 గంటల సమయంలోఈ భూకంపం వచ్చింది. బర్మా సిటీకి దక్షణం వైపు.. నే పై టావ్ అనే ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉంది. భూమికి 33 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం ఉండటంతో.. అతి భారీ ప్రమాదం తప్పిందంటున్నారు అధికారులు. 

కొత్తగా వచ్చిన ఈ భూకంపం తీవ్రతను మయన్మార్ దేశంలో 5.3 తీవ్రతగా నమోదు చేస్తే.. ఆ పక్కనే ఉన్న థాయ్ లాండ్ దేశం మాత్రం దాని తీవ్రతను 5.9గా చెబుతోంది. ఈ భూకంపం ప్రకంపనలు థాయ్ లాండ్ దేశాన్ని తాకాయి. 

ALSO READ | మయన్మార్ లో ఆ 12 వందల కిలోమీటర్ల భూమి చాలా చాలా డేంజర్..

ఈ భూకంపం వల్ల బర్మాతోపాటు సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. ఇప్పటికే మండలే సిటీ మొత్తం విధ్వంసంగా మారింది. శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు సైతం.. ఈ భూకంపంతో రోడ్లపైకి వచ్చారు. ఇక థాయ్ లాండ్ దేశం బ్యాంకాక్ లోనూ ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయి. భవనాల్లో ఉన్న జనం బయటకు వచ్చారు.

తీవ్రత తక్కువగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు జనం. 24 గంటల క్రితం వచ్చిన రెండు భారీ భూకంపాలతో వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మరి కొన్ని వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. అలాంటి భవనాలు ఈ భూప్రకంపనలకు మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. భూకంపం ధాటికి దెబ్బతిన్న ఇళ్లల్లో ప్రజలు ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. జనం మాత్రం వినటం లేదు.. ఎక్కడికి వెళ్లాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు హాయిగా ఇళ్లల్లో ఎంతో ఉన్న వారు.. ఇప్పుడు కట్టుబట్టలతో నడిరోడ్డుపై పడ్డారు.

లేటెస్ట్ గా వచ్చిన ప్రకంపనలతో మళ్లీ భయంతో వణికిపోతున్నారు మయన్మార్, థాయ్ లాండ్ జనం..