మహా జాతరలు.. మీడియా మేనేజ్​మెంట్​

మహా జాతరలు.. మీడియా మేనేజ్​మెంట్​

మన దేశంలో అతిపెద్ద  మానవ  సమూహాలు ఒక దగ్గర గూమిగూడే జాతరలు, ఉత్సవాలు అనేకం జరుగుతున్నాయి. వీటిలో గంగానది మహా కుంభమేళా,  శబరిమల మకరజ్యోతి దర్శనం,  ములుగు జిల్లాలోని మేడారంలో  ప్రతి రెండేళ్లకు  ఒకసారి జరిగే  సమ్మక్క– సారలమ్మ  గిరిజన జాతర,  తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రముఖంగా ఉన్నాయి.  ఇలా భారీ ఉత్సవాల సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం పరిపాటే.  

అయితే, ఈ చిన్న పొరపాట్లను మీడియా విస్తతంగా పెరిగిన ప్రస్తుత సమయంలో  హైప్  క్రియేట్ చేయడం జరుగుతోంది.  దీంతో  ఈ మహా ఉత్సవాలకు హాజరయ్యే  సామాన్య పౌరులకు భయం, ఆందోళన కలుగుతున్నాయి.  తద్వారా  స్వల్ప విషయాలు అయినప్పటికీ పెద్ద ఎత్తున పుకార్లు జరిగి మొత్తం ఈ భారీ  ఉత్సవాల పట్ల  భయాందోళన కలగజేస్తున్నాయి.  ఈ ప్రమాదాలను,  నివారించేందుకు  మీడియా మేనేజ్​మెంట్​ అనేది ఈ  ప్రధాన ఉత్సవాలలో కీలక పాత్ర పోషిస్తుంది.  

ప్రయాగ్ రాజ్​లో జరిగిన  మహా కుంభమేళాలో  జనవరి 29న  జరిగిన తొక్కిసలాటలో 30మంది  మరణించగా,  దాదాపు 90మందికి గాయాలయ్యాయని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న  ఢిల్లీ రైల్వేస్టేషన్లో  జరిగిన  ప్రమాదంలో కనీసం 18మంది మరణించగా  పదిహేను మంది గాయపడ్డారు. కుంభమేళాలో 60 శాతం పుణ్యస్నానాలుభారతదేశ జనాభాలో 60  %  ప్రజలు  మహా కుంభమేళాలో  పుష్కర స్నానాలు ఆచరించారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.  కుంభమేళాలో అద్భుతమైనరీతిలో  ఏర్పాట్లు ఉన్నాయన్న  ప్రచారం కూడా ఈసారి అనూహ్య రీతిలో దేశంలోని నలుమూలల నుంచి కుంభమేళాకు తరలేలా  చేశాయి.   

సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు జరిగిన కుంభమేళాలో 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.  అక్కడక్కడ భారీ  ట్రాఫిక్ జామ్  తప్ప ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను  ఆయా మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఈ  క్రౌడ్ మేనేజ్​మెంట్​ను చూసి మొత్తం  పాశ్చాత్య దేశాలే  అబ్బురపడ్డాయి.   ప్రయాగ్ రాజ్​లో జరిగిన ఈ ఆధ్యాత్మిక పండగ మొత్తం ప్రపంచంలో చర్చనీయాంశమైంది.  

క్రౌడ్ మేనేజ్​మెంట్​తోపాటు  ఏ విధమైన అంటువ్యాధులు,  నీటి  సంబంధిత వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.  స్నానఘాట్​ల వద్ద  అద్భుతమైన ఏర్పాట్లున్నాయని స్నానాలకు  వెళ్లి వచ్చినవారితోపాటు,  మీడియాలోనూ ఈ మొత్తం  రోజుల్లో  పాజిటివ్  కథనాలే వచ్చాయి.  ఈ  కుంభమేళాకు  40 కోట్లమంది  ప్రజలు హాజరవుతారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ అనూహ్యంగా 60 కోట్లకు మించి ప్రజలు వచ్చారు. 
 

కన్నెకంటి  వెంకటరమణ