జనగామ అర్బన్, వెలుగు: జనవరిలో ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు భారత్ గౌరవ్ యాత్ర పేరిట ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు ఐఆర్సీటీసీ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం జనగామ రైల్వేస్టేషన్లో ఐఆర్సీటీసీ టూరిజం ఎగ్జిక్యూటివ్ పవన్సెంగర్, సేల్స్, మార్కెటింగ్ ఇన్చార్జి నరేశ్‌బాబు, మార్కెటింగ్ టీం లీడర్ ప్రశాంత్, చీఫ్ కమర్షియల్ బుకింగ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఇప్పటివరకు దేశంలోని అనేక దర్శనీయ స్థలాలకు భారత్ గౌరవ్ యాత్ర పేరిట రైళ్లను నడిపించినట్లు తెలిపారు. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా యూపీలోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు వెళ్లేందుకు ప్రత్యేక రైలు జనవరి 19 న సికింద్రాబాద్‌లో బయలుదేరి, తిరిగి 26న వస్తుందని చెప్పారు. ఈ ట్రైన్లో 576 మంది ప్రయాణించవచ్చని, 320 స్లీపర్ క్లాస్, 206 థర్డ్ ఏసీ, 50 సెకండ్ ఏసీ బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎకానమీ రూ.22,635, స్టాండర్డ్ రూ.31,145, కంఫర్ట్ రూ.38,195 చార్జీ ఉంటుందని చెప్పారు.