మహాకుంభమేళా.. 34 రోజుల్లో 50 కోట్ల మంది పుణ్యస్నానాలు

మహాకుంభమేళా.. 34 రోజుల్లో 50 కోట్ల మంది పుణ్యస్నానాలు
  • ఇది 8 దేశాల జనాభా కంటే ఎక్కువ
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కుంభమేళా 
  • వివరాలు వెల్లడించిన యూపీ సర్కారు

లక్నో: యూపీలోని ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహాకుంభ మేళాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు దాదాపు 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది.   కేవలం 34 రోజుల్లోనే  ఇన్ని కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్టు వెల్లడించింది. భారత్‌‌‌‌, చైనా మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల పాపులేషన్​ను..కుంభమేళాను దర్శించిన  హిందూ యాత్రికుల సంఖ్య దాటేసిందని, ఇది  అమెరికా, రష్యాల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువని  పేర్కొన్నది.   ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా మహాకుంభ మేళా నిలుస్తుందని వెల్లడించింది. 

కాగా, శుక్రవారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 92 లక్షల మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించారని యూపీ సర్కారు పేర్కొన్నది. మహాకుంభ మేళా గత నెల 13న ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనున్నది.  కాగా, మహాకుంభ మేళాలో రికార్డుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. దేశ ఆధ్యాత్మిక, ఐక్యత, సమానత్వం, సామరస్యానికి మహాకుంభ మేళా సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్​మీడియాలో పోస్ట్ పెట్టారు. 50 కోట్ల మందికిపైగా పుణ్యస్నానం ఆచరించడం ప్రజలకు సనాతన ధర్మంపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నదని చెప్పారు. ఈ పుణ్యకార్యంలో పాల్గొన్న మతపెద్దలు, సాధువులు, సన్యాసులు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.  

కుంభమేళాను పొడిగించండి: అఖిలేశ్​ యాదవ్​

మహాకుంభ మేళాను పొడిగించాలని యూపీ సర్కారును సమాజ్​వాదీ పార్టీ చీఫ్​అఖిలేశ్​ యాదవ్​ రిక్వెస్ట్​ చేశారు. చాలా మంది భక్తులు ఇంకా రోడ్లపైనే ఉన్నారని, ట్రాఫిక్​ కారణంగా త్రివేణి సంగమానికి చేరుకోలేకపోతున్నారని చెప్పారు. గతంలో 75 రోజులపాటు కుంభమేళా సాగిందని, కానీ ఈసారి 44 రోజుల్లోనే ముగిస్తున్నారని అన్నారు. అలాగే, గత నెలలో మహాకుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి అసలు సంఖ్యను  రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందని అఖిలేశ్​ ఆరోపించారు. 

కుంభమేళాలో మరోసారి మంటలు 

ప్రయాగ్ రాజ్​లోని మహాకుంభ మేళాలో మరోసారి మంటలు చెలరేగాయి. 18,19వ సెక్టార్ల మధ్య శనివారం అగ్ని ప్రమాదం జరగ్గా.. కొన్ని టెంట్లు కాలిపోయాయి. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్​ బలగాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 

కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం .. 10 మంది భక్తుల మృతి

ఉత్తరప్రదేశ్​లో మహాకుంభమేళాకు వెళ్తున్న బస్సును బొలేరో వాహనం ఢీకొట్టగా10 మంది భక్తులు మృతిచెందారు. మరో19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మీర్జాపూర్–ప్రయాగ్​రాజ్​ హైవేపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. చత్తీస్​గఢ్ లోని కోర్బాకు చెందిన పలువురు బొలేరోలో మహా కుంభమేళాకు బయలుదేరారు. ఈ వెహికల్ మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​కు చెందిన భక్తులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 10 మంది కన్నుమూశారు. వీరంతా చత్తీస్​గఢ్​కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డవారిని సమీప దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.  కాగా, శనివారం రాత్రి ఢిల్లీలోని రైల్వే స్టేషన్​లో కుంభమేళా ట్రైన్లకు విపరీతమైన రద్దీతో తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది.  ఈ ఘటనలో నలుగురు మహిళలు స్పృహ తప్పగా,15 మంది గాయపడ్డారు.