3 రోజుల్లో 6 కోట్ల మంది.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

  • త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న జనం

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తొలి రోజు సోమవారం 1.5 కోట్ల మంది భక్తులు రాగా.. రెండో రోజు ఏకంగా 3.5 కోట్ల మంది గంగ, యమున, సరస్వతి నదుల కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. మూడు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల మందికి పైగా మహా కుంభమేళాలో పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయుల కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు వస్తుండటంతో ప్రయాగ్ రాజ్ జనసందోహంగా మారింది.  వచ్చే నెల 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు.. దాదాపు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.

చనిపోయిన తల్లి ఫొటోతో పుణ్యస్నానం

మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన మిశ్రా అనే వ్యక్తి.. అలహాబాద్ వచ్చారు. ఇంటి నుంచి వస్తూ వస్తూ.. చనిపోయిన తన తల్లి ఫొటోను తీసుకొచ్చారు. తల్లి ఫొటోతోనే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. మరణించిన తన తల్లి ఫొటోతో.. గంగ, యమున, సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయటం వల్ల ఆమెకు మోక్షం లభిస్తుందనే ఇలా చేసినట్లు చెప్పాడు. చనిపోయిన తల్లి ఫొటోతో మిశ్రా పుణ్య స్నానం చేయటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొడుకు అంటే ఇలా ఉండాలి.. ఇలాంటి కొడుకు అందరికీ ఉండాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం  మిశ్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కుంభమేళాలో ఈమెనే హైలెట్..!

మహాకుంభ మేళాలో హర్ష రిచార్య  అనే ఓ మహిళా సాధ్వి అందరినీ ఆకర్షిస్తున్నది. మెడలో రుద్రాక్ష హారం, పువ్వుల మాల ధరించి నుదిటిపై తిలకంతో  ఆధ్యాత్మికంగా కనిపించారు.  హర్ష రిచార్య.. 1994 మార్చి 26న మధ్యప్రదేశ్ లో జన్మించారు. మోడల్, యాంకర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా పనిచేశారు.అయితే, రెండేండ్ల కిందట ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో కొత్త జీవితం ప్రారంభించింది. తన వయసు 30 ఏండ్లని, రెండేండ్లుగా సాధ్విగా జీవిస్తున్నానని హర్ష రిచార్య చెప్పింది.