
మహాకుంభమేళా ముగిసింది.. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన ఉత్సవాలు నేటితో ( ఫిబ్రవరి 26, 2025 ) ముగిసాయి. కుంభమేళా చివరి రోజు పైగా మహాశివరాత్రి కావడంతో ఇవాళ ఒక్కరోజే 2.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో ఇప్పటిదాకా 65 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించింది యూపీ సర్కార్.
కాగా.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలతో మహాశివరాత్రి నాడు ముగిసింది మహాకుంభమేళా. కుంభమేళా ముగింపుకు ముందు పదివేల మందికి పైగా నాగ సాధువులు కాశీ రోడ్ల గుండా దేవతామూర్తుల విగ్రహాలతో ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో నృత్యం చేస్తూ భారీగా ప్రదర్శన చేపట్టారు.
కుంభమేళాలో చివరి రోజైన శివరాత్రి నాడు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటేత్తారు. చివరిరోజున కుంభమేళాలో భక్తులపై హెలికాఫ్టర్‌తో పూలవర్షం కురిపించటం హైలైట్ గా నిలిచింది. చివరి రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో యూపీ అధికార యంత్రంగా అప్రమత్తమై ఎక్కడిక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఎక్కడ అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.