వసంత పంచమి: మహా కుంభమేళాలో 2 కోట్ల మంది అమృత స్నానాలు

వసంత పంచమి: మహా కుంభమేళాలో  2 కోట్ల మంది అమృత స్నానాలు


యూపీ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మౌని అమవాస్య రోజున జరిగిన తొక్కిసలాట తర్వాత  ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో   మళ్లీ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఫిబ్రవరి 3న సోమవారం బసంత్ పంచమీ(వసంత పంచమి) మూడో అమృత స్నానం సందర్భంగా త్రివేణి సంగమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమం దగ్గర 2 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. 

 ఫిబ్రవరి 3 సాయంత్రం 4 గంటల వరకు  గంగా, యమునా , పౌరాణిక సరస్వతి సంగమం దగ్గర సుమారు రెండు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం చేశారని యూపీ సర్కార్ తెలిపింది. రాత్రి వరకు  దాదాపు ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు  తెలిపింది. జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం  34.97 కోట్ల మంది భక్తులు వచ్చారని వెల్లడించింది.

ALSO READ | రథ సప్తమి రోజు (ఫిబ్రవరి 4) ఎలా స్నానం చేయాలి.. సూర్య భగవానుడిని ఎలా పూజించాలి..

ఇప్పటివరకు మౌని అమావాస్య రోజున అత్యధికంగా ఒకేరోజు  ఎనిమిది కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేశారు.  మకర సంక్రాంతి (జనవరి 14)నాడు 3.5 కోట్ల మంది.. జనవరి 30 ,  ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు కోట్ల మందికి పైగా భక్తులు, పౌష్ పూర్ణిమ (జనవరి 13) నాడు 1.7 కోట్ల మంది స్నానాలు చేశారు. మూడో అమృత స్నానం సోమవారం (ఫిబ్రవరి3)న రెండు కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు. మళ్లీ  రెండు ప్రత్యేక స్నాన తేదీలు ఫిబ్రవరి 12 (మాఘి పూర్ణిమ),  ఫిబ్రవరి 26 (మహాశివరాత్రి) న వస్తాయి.