గంగాజలంతో ఖైదీలకు పుణ్యస్నానం: యూపీలోని జైళ్లకు త్రివేణీ సంగమం జలాలు

గంగాజలంతో ఖైదీలకు పుణ్యస్నానం: యూపీలోని జైళ్లకు త్రివేణీ సంగమం జలాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న  ఖైదీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలోని 90 వేలకు పైగా ఖైదీలకు త్రివేణి సంగమం జలాలతో స్నానం చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ప్రయాగ్ రాజ్ నుంచి పవిత్ర జలాలను సేకరించి.. ఫిబ్రవరి 21న 75 జైళ్లకు తీసుకువెళతామని తెలిపింది. అక్కడున్న వాటర్ ట్యాంకులలో పవిత్ర గంగా జలాలను కలిపి, ఖైదీలతో స్నానం చేయిస్తామని వివరించింది. 

పవిత్ర స్నానాల అనంతరం ఖైదీలందరూ పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. 21న ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అన్ని జైళ్లలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. లక్నో జైలులో జరిగే కార్యక్రమంలో సీనియర్ జైలు అధికారులతో కలిసి తాను పాల్గొంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

కుంభమేళాలో పెరిగిన బైక్ టాక్సీ సేవలు

భారీ ట్రాఫిక్ కారణంగా మహాకుంభమేళా ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించడం స్థానికులకు వరంగా మారింది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 15 కిలో మీటర్ల దూరంలోనే అన్ని రకాల వెహికల్స్ ను నిలిపివేస్తుండటంతో స్థానిక యువకులు, స్టూడెంట్లు బైక్ టాక్సీ సేవలను స్టార్ట్ చేశారు. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ , రోడ్డు మార్గాల ద్వారా ప్రయాగ్ రాజ్ చేరుకున్న భక్తులను త్రివేణి సంగమానికి చేరుస్తున్నారు. ఒక్కో రైడ్‌‌కు సర్వీస్ ఛార్జీలు రూ.100 నుంచి 1,000 వరకు తీసుకుంటున్నారు. 

ఇలా రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా సంపాదిస్తున్నారు. అయితే, ఈ బైక్ టాక్సీ సేవలను కొంతమంది యాత్రికులు స్వాగతిస్తుండగా, మరికొందరు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.