![కుంభమేళా గ్లామర్ హబ్ కాదు](https://static.v6velugu.com/uploads/2025/02/maha-kumbh-is-not-a-hub-of-glamour-and-5-star-culture_b1qQuNEoOg.jpg)
- వైరల్ వీడియోల సంస్కృతిని మీడియా ప్రోత్సహించొద్దు
- ఆలిండియా ఉదాసిన్ కమ్యూనల్ సంగత్ చైర్మన్ ధర్మేంద్ర దాస్
మహా కుంభ్ నగర్/న్యూఢిల్లీ: మహా కుంభమేళా ఫైవ్ స్టార్ సంస్కృతికి కేంద్రం కాదని ఆలిండియా ఉదాసిన్ కమ్యూనల్ సంగత్ చైర్మన్ మహంత్ ధర్మేంద్ర దాస్ అన్నారు. గత నెలలో మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్, మోడల్స్, నటులు వైరల్ అయ్యారు. ఈ ఘటనలతో అసంతృప్తికి లోనైన ధర్మేంద్ర దాస్ మహాకుంభమేళా వద్దో త్రివేణి రోడ్ స్థల్ లో మాట్లాడారు. ‘‘మహాకుంభ్ అనేది ఫైవ్ స్టార్ కల్చర్, గ్లామర్ కు కేంద్రం కాదు.
సాధువులు, భక్తుల సనాతన విశ్వాసాలకు కేంద్రం. మీడియా అనేది సాధువులకు సేవ చేయాలి. కానీ, అలాంటి వారిని ప్రోత్సహిస్తుందంటే తప్పు మీడియాదే అవుతుంది. మీడియా సంస్థలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? మీరే దాని గురించి ఆలోచించాలి. విశ్వాసంతో మహాకుంభమేళాకు వచ్చిన భక్తులు నిజమైన మోక్షం పొందుతారు” అని ధర్మేంద్ర దాస్ చెప్పారు.
నేడు కుంభమేళాకు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళా పర్యటన ఖరారైంది. సోమవారం ఆమె ప్రయాగ్ రాజ్ కు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి10న ఉదయం ప్రయాగ్ రాజ్ కు వెళ్తారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించి ప్రార్థనలు చేస్తారు.
అనంతరం బడే హనుమాన్ , అక్షయవట్ ఆలయాల్లో పూజలు చేస్తారు. అనంతరం డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్ ను సందర్శిస్తారు”అని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.