- భక్తులతో కళకళలాడనున్న ప్రయాగ్‌రాజ్
- జనసంద్రంలా ప్రయాగ్‌రాజ్
- తరలిరానున్న 45 కోట్ల మంది భక్తులు
- భారీగా తరలివచ్చిన నాగసాధువులు, అఘోరాలు
- ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టెంట్ బుకింగ్ వివరాలు
లక్నో: ఉత్తరప్రదేశ్fలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నుంచి మహా కుంభమేళా ప్రారంభంకానుంది. వచ్చే నెల 26వ తేదీ వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలో దాదాపు 45 కోట్ల మంది భక్తులు పాల్గొననున్నారు.
సాధారణ ప్రజలతో పాటు నాగసాధువులు, అఘోరాలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. శివరాత్రి పండుగ దాకా భక్తులతో ప్రయాగ్‌రాజ్ కళకళలాడనుంది. ఇప్పుడు జరిగే మహా కుంభమేళా 12 ఏండ్లకు ఒకసారి జరిగేది.
కుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం. ప్రయాగ్‌రాజ్ వద్ద గంగ, యమున, సరస్వతి నదుల కలయికతో ఏర్పడిన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు. ఇలా చేస్తే తమ పాపాలు తొలగిపోయి, మోక్షం (విముక్తి) లభిస్తుందని భక్తుల నమ్మకం.
కుంభమేళా ముఖ్య తేదీలివే..!
కుంభమేళాలో పుణ్య స్నానాలకు (షాహి స్నాన్) ప్రత్యేక స్థానముంది. జనవరి13(పౌష్ పూర్ణిమ), జనవరి 14 ( మకర సంక్రాంతి–మొదటి షాహీ స్నాన్), జనవరి 29 ( మౌని అమావాస్య–రెండవ షాహి స్నాన్), ఫిబ్రవరి 3 (వసంత పంచమి–మూడో షాహి స్నాన్), ఫిబ్రవరి 12 (మాఘ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహాశివరాత్రి) పర్వదినాల్లో స్నానాలు ఆచరించనున్నారు. ఫిబ్రవరి 26 న మహా కుంభమేళ ముగుస్తుంది.
టెంట్‌ను ఎలా బుక్ చేయాలంటే..!
మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ www.irctctourism.com లేదా అధికారిక కుంభమేళా సైట్ kumbh.gov.in ద్వారా టెంట్‌ను బుక్ చేసుకోవచ్చు.
వెకేన్సీ వివరాలు, రకాలు, ధరలు తెలుసుకోవచ్చు. ఒక రాత్రికి రూ.1,500 నుంచి రూ. 35 వేల ధర గల లగ్జరీ టెంట్లు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులతో రిజర్వేషన్ చేసుకోవచ్చు.
శంకర్ మహదేవన్, మోహిత్ చౌహాన్ షోలు
మహా కుంభమేళా సందర్భంగా భక్తుల కోసం ఆధ్యాత్మికత కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రాములు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు శంకర్ మహదేవన్ ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
మోహిత్ చౌహాన్ ప్రదర్శనతో ఈవెంట్‌ను ముగించనున్నారు. ఉత్సవాల్లో కైలాశ్ ఖేర్, షాన్ ముఖర్జీ, హరిహరన్, కవితా కృష్ణమూర్తి, కవితా సేథ్, రిషబ్ రిఖిరామ్ శర్మ, శోవన నారాయణ్, డా. ఎల్ సుబ్రమణ్యం, బిక్రమ్ ఘోశ్, మాలినీ అవస్తి, ఇతరులు ప్రదర్శనలు చేయనున్నారు.
ఈ కల్చరల్ ప్రోగ్రాములన్నీ కుంభమేళా మైదానంలోని గంగా పండల్‌లో నిర్వహించనున్నారు. శాస్త్రీయ నృత్యం, జానపద సంగీతం, నాటకీయ కళలతో దేశ
సాంస్కృతిక గొప్పతనాన్ని వివరించనున్నారు.