మహాకుంభ్‌నగర్ (యూపీ): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు విదేశీ భక్తులు కూడా త్రివేణి సంగమం చేరుకుంటున్నారు. మంగళవారం భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ గంగా మాతకు హారతి ఇచ్చి పుణ్య స్నానమాచరించారు. ఆయన వెంట సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. భూటాన్ లోని థింపు నుంచి సోమవారమే లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వాంగ్చుక్కు సీఎం యోగి బొకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌తో భేటీ అయ్యారు. మహత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇండియా, భూటాన్ దేశాల మధ్య సంబంధాలపై ముగ్గురు చర్చించారు. మంగళవారం ఉదయం వాంగ్చుక్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ త్రివేణి సంగమం వద్దకు తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు చేసి గంగా మాతకు హారతి ఇచ్చారు. అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్, నంద్‌గోపాల్ గుప్తాతో కలిసి త్రివేణి సంగమంలో వాంగ్‌చుక్ పుణ్య స్నానం చేశారు. సూర్య భగవానుడికి జల సమర్పణ చేశారు. పక్షులకు దాణా తినిపించారు. అనంతరం అక్షయవట్, బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఇప్పటి వరకు సుమారు 40కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు మేళా నిర్వాహకులు తెలిపారు.
మృతుల సంఖ్య వెల్లడించాలి: అఖిలేశ్
మహా కుంభ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. మృతుల వివరాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మహాకుంభ మేళా అన్నప్పటికీ.. అలాంటి వసతులు, సమాచారం వంటివేవీ అక్కడ లేవని విమర్శించారు.
‘లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్’ సేవలు..
మహాకుంభ మేళాలో తప్పిపోయిన 13వేల మందిని ‘లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్’ కలిపింది. మౌని అమవాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలోనే 7,500 మంది తప్పిపోయారు. వారందరినీ ఓ చోట చేర్చి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తప్పిపోయిన వాళ్లల్లో 64% మంది మహిళలే ఉన్నారు. ఈ సెంటర్‌ను 2024 డిసెంబర్ 7న సీఎం యోగి ప్రారంభించారు.
నేడు ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. దీంతో యూపీ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ మేరకు పీఎంవో అధికారులు మోదీ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ప్రధాని మోదీ.. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నైనిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో 10.45 గంటలకు దిగుతారు.
అరైల్ ఘాట్ నుంచి బోట్లో త్రివేణి సంగమం వద్దకు వెళ్తారు. గంగా మాతకు పూజ చేసి పుణ్య స్నానమాచరిస్తారు. పలువురు సాధువులతో భేటీ అవుతారు. తర్వాత మళ్లీ బోటులో అరైల్ ఘాట్.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రయాగ్ రాజ్ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోతారు.