- వసంత పంచమి కావడంతో 5 కోట్ల మంది పుణ్య స్నానాలు
- పాల్గొన్న 13 అఖాడాల నాగ సాధువులు
- పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంతపంచమి కావడంతో పుణ్య స్నానమాచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్ద క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో నాగ సాధువులు, కల్పవాసీలు, 13 అఖాడాలు స్నానమాచరించారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సోమవారం ఒక్క రోజే సుమారు 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు స్నానమాచరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య సుమారు 40 కోట్లకు చేరిందని వివరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు వార్ రూమ్ నుంచి అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తున్న భక్తులపై ఉదయం హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. ఈ నెల 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి ఉన్నాయి. ఈ రెండు రోజుల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమానికి తరలివచ్చే అవకాశాలున్నాయి. మొత్తం ఆరు శుభ ముహుర్తాల్లో నాలుగు పూర్తయ్యాయి.
మూడు సెక్టార్లలో నాగ సాధువుల స్నానాలు
తెల్లవారుజామున 4 నుంచే సన్యాసి, ఉదాసీన్, బైరాగీ సెక్టార్లలో అఖాడాలు స్నానమాచరించేందుకు అధికారులు అనుమతించారు. పంచాయతీ అఖాడా సభ్యులు ముందుగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. తర్వాత శంభు పంచాయతీ అటల్ అఖాడా, తపోనిధి పంచాయతీ నిరంజనీ అఖాడా, పంచాయతీ అఖాడా ఆనంద్‌తో సహా మొత్తం 13 అఖాడా సాధువులు స్నానమాచరించారు. పుణ్య స్నానానికి ముందు అఖాడాలతో పాటు నాగ సాధువులు ‘హర.. హర.. మహాదేవ.. శంభో.. శంకర, మా గంగామయ్యాకి జైహో’ నినాదాలు చేస్తూ.. భక్తి పాటలు పాడుతూ త్రివేణి సంగమానికి చేరుకున్నారు.
ఒక్కో అఖాడాకు 40 నిమిషాలు కేటాయించారు. బైరాగీ సెక్టార్, ఉదాసీన్ సెక్టార్లలోనూ టైమ్ స్లాట్ ప్రకారం స్నానాలు ఆచరించేందుకు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం కల్లా అఖాడాలు, నాగ సాధువుల పుణ్య స్నానాల పూర్తయ్యాక.. సాధారణ భక్తులకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు నాగ సాధువులు, అఖాడాలు ధన్యవాదాలు తెలిపారు.
భారీగా తరలివచ్చిన విదేశీయులు
పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు హనుమాన్ చాలీసా చదువుతూ.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. మేళాలో పాల్గొనడం.. మాటల్లో చెప్పలేని మధుర అనుభవమని బెల్జియంకు చెందిన ఓ భక్తురాలు తెలిపింది. త్రివేణి సంగమంలో స్నానం చేయడంతో బాడీలో ఓ పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయిందన్నారు.
సనాతన ధర్మాన్ని పరిచయం చేసిన తన ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్ చెప్పింది. 17 ఏండ్లుగా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నట్లు రష్యాకు చెందిన మీనాక్షి గిరి (మహానిర్వాణి అఖాడా) తెలిపింది. 13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్లు జునా అఖాడా పీఠాధీశ్వర్ ఆచార్య మహామండలేశ్వర్ అవధేశానంద్ గిరి మహరాజ్ తెలిపారు.