తెలంగాణ నుంచి తీర్థయాత్రలకు వెళ్లిన యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సీ గ్రామానికి చెందిన శీలం దురుపతి (60) సజీవ దహనమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 1న ముదోల్ నుంచి తీర్థయాత్రల పేరిట 50 మంది ప్రయాణికులు బయలుదేరారు. వీరు టెంపుల్ సిటీ మథురలోని బృందావనాన్ని సందర్శించి ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌కు వెళ్తుండగా.. మంగళవారం సాయంత్రం పానీ గావ్ సంపర్క్ మార్గ్‌లోని టూరిస్ట్ ఫెసిలిటీ సెంటర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. యాత్రికుల కథనం ప్రకారం.. శీలం దురుపతి (60) అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయారు. మిగతా యాత్రికులు సమీపంలోని తీర్థ స్థల దర్శనానికి వెళ్లగా, ఈ లోగా బస్సు మంటల్లో కాలి పోయింది. దురుపతి పొగ తాగడమే అగ్నిప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.
ALSO READ | రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కేరళవాసి మృతి.. కేంద్రం సీరియస్
ఈ ఘటనపై ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. మధుర కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడి యాత్రికులను వీలైనంత త్వరగా తరలించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఆహారం, వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో యాత్రికుల వస్తువులు కూడా దగ్ధమైనట్లు వెల్లడించారు.