కుంభమేళాలో మాఘ పౌర్ణమి రద్దీ.. ఒక్కరోజే సుమారు 2.50 కోట్ల మంది పుణ్య స్నానాలు

కుంభమేళాలో మాఘ పౌర్ణమి రద్దీ.. ఒక్కరోజే సుమారు 2.50 కోట్ల మంది పుణ్య స్నానాలు
  • పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
  • దీక్ష ముగించుకున్న 10 లక్షల మంది కల్పవాసీలు
  • మేళా నుంచి తిరుగు ప్రయాణం

మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తారు. బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది త్రివేణి సంగమానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు చేశారు. బుధవారం ఒక్క రోజే సుమారు 2.50 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలోని అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.

ఈ మేరకు ఘాట్ల వద్ద రద్దీ, ట్రాఫిక్ జామ్లపై అధికారులకు కొన్ని సూచనలు చేశారు. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మేళా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మాఘా పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున హెలికాప్టర్ నుంచి త్రివేణి సంగమంలోని భక్తులపై పూల వర్షం కురిపించారు. ఈ మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల కల్పవాసీ దీక్ష ముగించుకున్న దాదాపు 10లక్షల మంది మహా కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో వారంతా ట్రాఫిక్‌‌‌‌ నిబంధనలు పాటించాలని, పార్కింగ్‌‌‌‌ స్థలాలను మాత్రమే వినియోగించాలని అధికారులు కల్పవాసీలకు విజ్ఞప్తి చేశారు.

డ్రోన్ల సహాయంతో భక్తుల రద్దీపై నిఘా
క్రికెట్ లెజెండ్ అనిల్ కుంబ్లే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఆయన వెంట భార్య చైత్నా రామతీర్థ కూడా ఉన్నారు. మాఘ పౌర్ణమి కావడంతో వీఐపీ ప్రొటోకాల్​ను యూపీ ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

స్నానాలు ఆచరించిన వెంటనే భక్తులను ఘాట్ల నుంచి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తుల సేఫ్టీ కోసం ‘ఆపరేషన్ చతుర్భుజ్’ లాంచ్ చేసినట్లు చెప్పారు. డ్రోన్ల సహాయంతో భక్తుల రద్దీని అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా సుమారు 50 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు.