![మహాకుంభమేళా.. ఫిబ్రవరి12న మాఘ పౌర్ణమి.. పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్రాజ్ నో వెహికల్ జోన్](https://static.v6velugu.com/uploads/2025/02/maha-kumbh-rush-triggers-one-of-indias-biggest-traffic-jams-pilgrims-stranded-in-300-km-traffic-jam_OFldNtfx4v.jpg)
- కుంభ మేళాకు పోటెత్తుతున్న భక్తులు
- ఇయ్యాల్నే మాఘ పౌర్ణమి.. పుణ్య స్నానం కోసం భారీ క్యూ
- 350 కిలో మీటర్లకు పెరిగిన ట్రాఫిక్ జామ్
మహాకుంభనగర్ (యూపీ): మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతున్నది. బుధవారం మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు మేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.
350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్‌రాజ్‌ను ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. ఎమర్జెన్సీ, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు స్పెషల్ ట్రాఫిక్ ప్లాన్‌ను రూపొందించారు.
మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలన్నీ నిండిపోయాయి.
మరిన్ని వెహికల్స్‌ను సిటీలోకి అనుమతిస్తే నడుచుకుంటూ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు తెలిపారు. సాధువులంతా తమకు కేటాయించిన నిర్ణీత సమయంలోనే స్నానం చేయాలన్నారు. పుణ్య స్నానం ఆచరించిన
వెంటనే ఘాట్‌ను ఖాళీ చేయాలని కోరారు.
50 కిలో మీటర్ల జర్నీకి 12 గంటల టైమ్
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా.. వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించేలా స్పెషల్ రూట్ ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని ప్రయాగ్రాజ్ వాసులకు అధికారులు సూచించారు.
ఆన్లైన్ మోడ్‌లోనే పాఠాలు బోధించాలని స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు అధికారులు ఆదేశించారు. కాగా, జబల్‌పూర్ – ప్రయాగ్రాజ్ రూట్లో సుమారు 350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 50 కిలో మీటర్ల జర్నీకి సుమారు 12 గంటలకు పైగా టైమ్ పడుతున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
అంబానీ ఫ్యామిలీ పుణ్య స్నానం
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ త్రివేణి సంగమంలో మంగళవారం పుణ్య స్నానమాచరించింది. ఆయన తల్లి కోకిలాబెన్ అంబానీ కూడా మేళాకు వచ్చారు. ముఖేశ్ అంబానీ కొడుకులు అనంత్, ఆకాశ్ హాజరయ్యారు.
ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా, ఇద్దరు పిల్లలు పృథ్వి, వేద కూడా పుణ్య స్నానమాచరించారు. నాలుగు తరాలకు చెందిన అంబానీ ఫ్యామిలీ మొత్తం త్రివేణి సంగమానికి వచ్చింది.
భారీ భద్రత మధ్య అరైల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడ గంగామాత, సూర్య భగవానుడికి పూజచేసి పుణ్య స్నానమాచరించారు. కాగా, 29 రోజుల్లో 45 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానమాచరించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
కాగా, గోవధ నిషేధంపై మార్చి 17లోపు తుది నిర్ణయం తీసుకోవాలని ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అల్టిమేటం జారీ చేశారు.