కిక్కిరిసిన కుంభమేళా: మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు

కిక్కిరిసిన కుంభమేళా: మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు

మహాకుంభనగర్(యూపీ): ప్రయాగ్​రాజ్ మహాకుంభ మేళాకు లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివస్తున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య ఉండటంతో త్రివేణి సంగమానికి భక్తుల రాక పెరిగింది. అదేవిధంగా, వారంతం కావడంతో మేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సుమారు 60 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్ర, శని వారాల్లో సుమారు 1.50 కోట్ల మంది భక్తులు రాజస్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాప్​లు, హైవేలన్నీ భక్తులతో నిండిపోయాయి.

మౌని అమవాస్య వస్తుండటంతో అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఒక్కరోజే సుమారు 10 కోట్ల మంది భక్తులు మేళాకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నో వెహికల్ జోన్లను ఏర్పాటు చేశారు. మౌని అమావాస్య రోజు నో స్పెషల్​ ప్రొటోకాల్​ను అమలు చేయనున్నారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన షాపులను తొలగించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

మేళా ప్రాంతాన్ని పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు క్లీన్​ చేస్తున్నారు. భక్తులందరూ మహాకుంభ మేళా ఆఫీషియల్ చాట్​బాట్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నేరుగా త్రివేణి సంగమానికి చేరుకునేలా నావిగేషన్ సిస్టమ్​ను డెవలప్ చేసినట్లు వివరించారు. కాగా, మహాకుంభ మేళాకు విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

రాజకీయం చేయొద్దు: అఖిలేశ్

త్రివేణి సంగమంలో సమాజ్​వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆదివారం పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘కుంభమేళాలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉన్నది. అయితే, ఈ కుంభమేళాను రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. వచ్చిన భక్తులకు ఆటలపోటీల్లో పాల్గొన్నట్లు ఉండకూడదు.

అన్ని సవ్యంగా జరగాలి. వృద్ధులకు సరైన సౌకర్యాలు కల్పించాలి’ అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. కాగా, బాక్సర్ మేరికోమ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. హిందూ కల్చర్, ట్రెడీషన్ అంటే ఎంతో గౌరవమని తెలిపారు.