
మహా కుంభమేళా జలాలలో ప్రాణాంతక బ్యాక్టీరియా వృద్ధి చెందిందని, అది ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రకటించింది. కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించడంతో ప్రయాగ్ రాజ్ నీళ్లలో ‘కోలీఫామ్’ బ్యాక్టీరియా పెరిగిపోయందని, నీళ్లలో ఉండే మోతాదును మించిపోయిందని తెలిపింది. 100 మిల్లీ లీటర్ల నీటిలో 2,500 యూనిట్లకు పైగా బ్యాక్టీరియా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయంగా CPCB తెలిపింది.
భక్తుల రద్దీ కారణంగా గంగా నది ఒడ్డున కొన్నిచోట్ల నీటిలో బ్యాక్టీరియా పెరిగిపోయిందని, అక్కడి నీరు స్నానానికి సరిపడవని CPCB ప్రకటించడం ఆందోళన కలిగించే విషయం. ఈమేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు అందజేసిన రిపోర్టులో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ విషయాన్ని వెల్లడించింది. స్నాన ఘట్టాల వద్ద భక్తుల రద్దీ కారణంగా నీటిలో బ్యాక్టీరియా లెవల్స్ పెరిగిపోయాయని చెప్పింది.
ALSO READ | కుంభమేళాలో ఒక్క రోజే 99 లక్షల మంది పుణ్యస్నానం.. ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా భక్తులు హాజరు
మనుషులు, జంతువుల పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు నీళ్లలో పెరిగిపోయాయని, మానవ లేదా జంతు వ్యర్థాల కారణంగా నీళ్లలో బ్యాక్టీరియా పెరిగిపోయిందని ప్రకటనలో తెలిపింది. కోలీఫామ్ బ్యాక్టీరియా వల్ల అన్ని సందర్భాల్లో నష్టం లేనప్పటికీ, వాటి తీవ్రత పెరిగిపోవడం వల్ల నష్టం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వైరస్ లు, సాల్మొనెల్లా, ఇ కోలీ బ్యాక్టీరియాల వల్ల తీవ్రమైన చర్మ వ్యాధులతో పాటు ఇతర అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, పసి పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదమని హెచ్చరించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతోన్న ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. 2025, జనవరి 13న మొదలైన మహా కుంభ్.. 2025, ఫిబ్రవరి 26న ముగియనుంది. ఇప్పటి వరకు మహా కుంభమేళాకు 55 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని, ప్రపంచంలో ఓ ఆధ్యాత్మిక వేడుకకు ఈ స్థాయిలో భక్తులు హాజరుకావడం ఇదే ప్రథమమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.