![మహాకుంభ సంప్రోక్షణ' సన్నాహాలు షురూ.. 19 నుంచి 5 రోజుల పాటు కార్యక్రమాలు](https://static.v6velugu.com/uploads/2025/02/maha-kumbha-samprokshana-starts-on-19-th-feb-in-yadagirigutta_WtSFhmpev5.jpg)
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వర్ణ దివ్యవిమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణకు సన్నాహాలు షురూ అయ్యాయి. ఈ నెల 19 నుండి 23 వరకు ఐదు రోజుల పాటు స్వర్ణ దివ్యవిమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా 'పంచకుండాత్మక సుదర్శన నృసింహ మహాయాగం' నిర్వహించడానికి కొండపైన ప్రధానాలయ ఈశాన్య దిశలో యాగశాల ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 23న స్వర్ణమయమైన దివ్యవిమాన గోపురానికి పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం దివ్యవిమాన గోపురంపై ఉన్న సుదర్శన నారసింహ చక్రానికి సంప్రోక్షణ పూజలు చేసి స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు.
23న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే పంచకుండాత్మక మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సామాన్య భక్తులు సైతం పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.