కాళేశ్వరంలో వైభవంగా మహా కుంభాభిషేకం

కాళేశ్వరంలో వైభవంగా మహా కుంభాభిషేకం

మహదేవపూర్, వెలుగు : జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌‌‌ మండలం కాళేశ్వరంలో శుక్రవారం మహాకుంభాభిషేకం పూజలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.  ఉదయం ఆరు గంటలకు వేద పండితులు త్రివేణి సంగమం వద్దకు వెళ్లి ఐదు కలశాలతో పవిత్ర జలాలను తీసుకొచ్చారు. 7.-30 గంటలకు గోపూజ, గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన అనంతరం అన్నదానం ప్రారంభించారు. 3.30 గంటల నుంచి ప్రత్యేక హోమాలు జరిపారు.

తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహాకుంభాభిషేక ఏర్పాట్లను కాటారం సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ మయాంక్‌‌‌‌ సింగ్‌‌‌‌ పరిశీలించారు. 9వ తేదీన జరిగే ముంపు ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు.