మహా కుంభమేళా భారతదేశ సాంస్కృతిక పరంపరకు, విశ్వాసాల ఔన్నత్యానికి సజీవ ప్రతీక. ప్రయాగరాజ్ త్రివేణి సంగమ పవిత్రస్థలంలో జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న ఈ మహా కుంభమేళా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వ జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మహా యజ్ఞం. సుమారు 45 రోజులపాటు సాగే ఈ మహా కుంభమేళాలో దాదాపు 40 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సమ్మేళనాలలో ఇది అరుదైన విషయం. మహా కుంభమేళా విజయవంతంగా కొనసాగడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇతర అవసరాల కోసం దాదాపుగా 6,990 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మహా కుంభమేళా ఆధ్యాత్మికత సమ్మేళనంగా మాత్రమే కాకుండా ఆర్థిక పునరుజ్జీవనంతో పాటు ఆర్థిక అవకాశాల కల్పనకు దోహదపడే అద్భుత వేదికగా నిలుస్తోంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. కుంభమేళా ప్రాంతం నుంచి దాదాపు రూ. 25,000 కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉంది. దీనిలో రూ. 5,000 కోట్ల విలువచేసే పూజా వస్తువులు, రూ.4,000 కోట్ల పాల ఉత్పత్తులు, రూ.800 కోట్ల పువ్వులు, ఆతిథ్య రంగం నుంచి రూ. 6,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
నిపుణుల అంచనా ప్రకారం 40 కోట్ల మంది భక్తుల ద్వారా 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉంది. సనాతన ధర్మంలో భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తూనే ఎంతోమందికి ఉపాధి కల్పించే వేదికలుగా మహా కుంభమేళా లాంటి ప్రత్యేక వేడుకలు మారుతున్నాయి. మహా కుంభమేళా సందర్భంగా యూపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మౌలిక వసతులు రాష్ట్ర అభివృద్ధితోపాటు దేశ అభివృద్ధిని ప్రభావితం చేయనున్నాయి. మహా కుంభమేళా ద్వారా 1శాతం జీఎస్డీపీ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
విదేశీయులనూ ఆకర్షిస్తున్న కుంభమేళా
సనాతన ధర్మ ఉపాసకులతోపాటు విదేశాల నుంచి దాదాపుగా 15 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడం కోసం వస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు, పురాణాల ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తం కావడంతోపాటు అనేక రకాలుగా ఆర్థికవృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.
మహా కుంభమేళాలో పాల్గొనే కళాకారులు తమ కళను భారతదేశంతోపాటు ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం లభిస్తుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్న మహా కుంభమేళా భారతదేశం ఆతిథ్య శక్తిని మరోసారి ప్రపంచానికి చాటినట్టు అయింది.
12 లక్షల కుటుంబాలకు ఉపాధి
భారతదేశ పురాణ పురుషులు ప్రారంభించిన పరంపర నేటికీ విజయవంతంగా కొనసాగడం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక, ఆర్థికశక్తితో పాటు వైషమ్యాలు లేని భారతదేశ ప్రజలే కారణం. యూపీలో ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళా ద్వారా దాదాపు 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తోంది. పరోక్షంగా 12 లక్షల కుటుంబాలు మహా కుంభమేళా వేదికగా ఆర్థిక వెసులుబాటును పొందనున్నాయి. ఇది సనాతన ధర్మ వేడుకల శక్తి.
కేవలం ఆధ్యాత్మిక ఆలోచనలు మాత్రమే కాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసికట్టుగా జీవించి ఉండేటట్లు చేయడమే సనాతన ధర్మ వేడుకల వెనుక దాగివున్న నిగూడ అర్థం. ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ నినాద స్ఫూర్తితో భారతదేశవ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం అమితంగా పెరిగింది.
కొందరు కుహనా లౌకికవాదులకు మహా కుంభమేళాలో జరిగే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమష్టి మేళవింపు కన్నులు తెరిపించేవిధంగా ఉంది. పాశ్చాత్య దేశాలు భారత దేశ సంస్కృతిని అవహేళన చేసే స్థాయి నుంచి మన వైభవ శక్తిని ఆకలింపు చేసుకొని అనుసరించే స్థితికి మన సనాతన ధర్మం ఎదిగింది. దానికి సజీవ నిదర్శనం మహా కుంభమేళా.
కుల, వర్ణ, వర్గ విభేదాలు లేని అఖండ సమ్మేళనం
ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో జరిగేది కేవలం అమృత, పవిత్ర స్నానాలు మాత్రమే కాదు. కుల, వర్ణ, వర్గ విభేదాలు లేని సామాజిక సమరసతతో కూడిన అఖండ సమ్మేళనం. ఆధ్యాత్మిక శక్తికి ఆర్థిక శక్తి తోడైతే ఆ సమాజం ఆచార వ్యవహారాలతో కూడిన ఆధునికత వైపు ఎంత వేగంగా సమష్టిగా పయనిస్తుందో తెలిపే అద్భుత సమ్మేళనం మహా కుంభమేళా.
స్వదేశీ పటిష్టతకు మూలమంత్రం
ప్రభుత్వం మౌలిక వసతుల కోసం, భక్తుల సౌకర్యాల కోసం చేస్తున్న ఖర్చుకు కొన్నివేల రెట్ల ఆర్థికవృద్ధి కలుగుతుంది. మహా కుంభమేళా భక్తుల విశ్వాసాలకు, భారతదేశ సాంస్కృతిక పరంపరకు సనాతన ధర్మ వైభవంతో పాటు లక్షలాదిమందికి ఉపాధిని కల్పించే అద్భుత మహాసమ్మేళనం.
మహా కుంభమేళా ఎన్నో రకాల స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడడంతోపాటు స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారుల పాలిట అమృత వేదికలా నిలిచింది. మహా కుంభమేళాలో భక్తులు ఉపయోగించే దాదాపు చాలా రకాల వస్తువులు స్వదేశీవి కావడం శుభపరిణామం.
వివిధ రాష్ట్రాల నుంచి అనేకమంది ఆ రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధి వస్తువులను వ్యాపారం నిమిత్తం మహా కుంభమేళాకు తీసుకురావడంతో భారతదేశ ఉత్పత్తుల వైవిధ్యం, విభిన్నత దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇది ఓరకంగా భారతదేశం విభిన్న సమ్మేళనాల సమష్టి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తున్నది.
- కేశవ్ సోనీ, ప్రాంత ప్రచార ప్రముఖ్, స్వదేశీ జాగరణ మంచ్, తెలంగాణ-