కుంభమేళాలో ఆరో రోజున 7 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు

  • ఆరో రోజుకు చేరుకున్న మహా కుంభమేళా
  • పెరుగుతున్న భక్తుల తాకిడి

మహాకుంభనగర్(యూపీ): ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహాకుంభ మేళా శుక్రవారంతో ఆరో రోజుకు చేరుకున్నది. ఇప్పటిదాకా సుమారు 7 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు. భారీగా భక్తులు తరలివస్తుండటంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) నుంచి మహా కుంభమేళా ఏర్పాట్లు, భద్రతా చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 2,750 కెమెరాలు ఇన్​స్టాల్ చేసినట్లు ఐసీసీసీ ఇన్​చార్జ్, ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. క్రౌడ్ కంట్రోల్, సర్వైలెన్స్, ఫైర్ సేఫ్టీ విషయంలో సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 

పార్కింగ్ ఏరియాలపై కూడా నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒక పార్కింగ్ లాట్ నిండిపోతే దాన్ని క్లోజ్ చేసి.. వేరే లాట్​కు వెహికల్స్​ను మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఘాట్లకు సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. వేరే సిటీలతో ప్రయాగ్​రాజ్ ఏడు మేజర్ రూట్లతో కనెక్ట్ అయి ఉందని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఏఐ బేస్డ్ కెమెరాల సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

కండల బాబా

మహా కుంభమేళాలో రష్యాకు చెందిన ‘‘కండల బాబా” అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఏడు అడుగుల ఎత్తు.. పొడవైన గడ్డం.. భుజాన పెద్ద బ్యాగ్‌‌‌‌.. మెడలో రుద్రాక్ష మాల.. కాషాయ బట్టల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలుస్తున్నాడు. 30 ఏండ్ల కిందే సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు రష్యాకు చెందిన ఆత్మ ప్రేమగిరి మహరాజ్ తెలిపాడు. అతన్ని చూసినవాళ్లంతా ‘‘మోడ్రన్ పరశురాముడు’’ అంటూ కితాబిస్తున్నారు. సోషల్ మీడియాలో గిరి మహారాజ్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నేపాల్‌‌లో ఉంటున్నాడు. అక్కడ హిందూ సమాజ వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఒకప్పుడు రెజ్లర్ అయిన ఆత్మ ప్రేమగిరి మహరాజ్ ప్రస్తుతం జునా అఖాడాలో సభ్యుడిగా ఉన్నారు.